పంజాబ్‌పై వార్నర్‌ అరుదైన ఘనత…

david warner
david warner

మొహాలి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ మరో రికార్డును నెలకొల్పాడు. సోమవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థశతకం బాదిన వార్నర్‌….పంజాబ్‌పై వరుసగా ఏడు అర్థశతకాలు బాదిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. వార్నర్‌ పంజాబ్‌ జట్టుపై ఆడిన గత ఏడు మ్యాచ్‌ల్లో వరుసగా 58, 81, 59, 52, 70, 51, 70 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐపిఎల్‌ చరిత్రలో రెండు జట్లపై వరుసగా ఏడు అర్థశతకాలు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా వార్నర్‌ నిలిచాడు. ఈ ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ 2014-16 కాలంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టుపై వరుసగా ఏడు అర్థశతకాలు బాదాడు. ఈ ఐపిఎల్‌ సీజన్‌లో వార్నర్‌ ఆరు మ్యాచ్‌ల్లో 349 పరుగులు చేసి, ఆరెంజ్‌ క్యాప్‌ విజేతగా కొనసాగుతున్నాడు. బాల్‌ టాంపరింగ్‌ కేసులో ఏడాదిపాటు వేటుకు గురైన వార్నర్‌ ఈ ఐపిఎల్‌తో ఆటకు రీఎంట్రీ ఇచ్చాడు. సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 62బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఈమ్యాచ్‌లో హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగా, పంజాబ్‌ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. ఈనెల 14న ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్‌ తర్వాత మ్యాచ్‌ ఆడనుంది.
మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :