గవర్నర్ పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారుః బండి సంజయ్

గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలుపలేదన్న పల్లా

bandi-sanjay

హైదరాబాద్ః ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పై ధ్వజమెత్తారు. బడ్జెట్ కు ఆమోదం తెలుపకుండా అకృత్యం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలుపని చరిత్ర గతంలో లేదని అన్నారు. గవర్నర్ తీరును ప్రజల్లోకి తీసుకెళతామని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

కాగా, పల్లా వ్యాఖ్యలకు తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ ను అసెంబ్లీకి ఎందుకు ఆహ్వానించడంలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. గవర్నర్ ప్రసంగం అసెంబ్లీలో ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. అయినా, బడ్జెట్ అనుమతికి ఇంకా సమయం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కావాలనే గవర్నర్ పై వివాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.