బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్న వీవీఎస్‌ లక్ష్మణ్‌

భారత క్రికెట్ చరిత్రలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అతి త్వరలో ఈయన బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు సెలబ్రిటీలను పార్టీలోకి చేర్చుకుని ఓటర్లను ఆకట్టుకోవడం రాజకీయ పార్టీల టెక్నిక్. ఈ క్రమంలోనే GHMC పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ ను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రకటన అధికారికంగా రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గనుక అసెంబ్లీకి(అంబర్ పేట నుంచి) పోటీ చేస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో లక్ష్మణ్ ను బరిలోకి దించాలని, అలా కాని పక్షంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచే వీవీఎస్ ను నిలబెట్టాలని బీజేపీ యోచిస్తున్నట్లు వినికిడి.

హైదరాబాద్‌ కు చెందిన లక్ష్మణ్ భారత జట్టుకు కీలకమైన విజయాలెన్నో అందించి, 2012లో అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు చెప్పాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ టోర్నీలో డెక్కన్‌ చార్జెస్‌ కు కెప్టెన్‌ గా వ్యవహరించాడు. వయసు మీద పడుతుండటంతో ప్రస్తుతం హైదరాబాద్ సన్‌ రైజర్స్‌ జట్టుకు మెంటర్‌ గా కొనసాగుతున్నాడు. ఆటగాడిగా రిటైరైన తర్వాత హైదరాబాద్ సిటీలోనే అకాడమీ స్థాపించిన లక్ష్మణ్ పేద పిల్లలకూ క్రికెట్ లో శిక్షణ ఇస్తున్నాడు. పదుల కొద్దీ స్వచ్ఛంద సంస్థలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న లక్ష్మణ్ సామాజిక సేవలోనూ అగ్రభాగన ఉన్నారు. వీవీఎస్ ఫౌండేషన్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.