త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాకు ఎస్‌ : చిరంజీవి

VVR PRE RELEASE EVENT
VVR PRE RELEASE EVENT

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `విన‌య విధేయ రామ‌`. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ మంత్రి, టి.ఆర్‌.ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.టి.ఆర్‌ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా…

మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ – ”చిరంజీవి నువ్వేమి సాధించావ్‌? అని ఎవరైనా అడిగితే రెండు అని చెప్పగలను. ఒకటి రాంచరణ్‌ అయితే.. రెండు ఎప్పటికీ తరిగిపోని కోట్లాది మంది అభిమానులనే అని గుండె లోతుల్లో నుండి చెప్పగలను. రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీ అభిమానం ఎలా ఉంటుందోనని మీమాంస ఉండేది. అయితే ఖైదీ నంబర్‌ 150 సినిమాను సూపర్‌డూపర్‌ హిట్‌ చేసి అభిమానం చెక్కు చెదరలేదు అని నిరూపించారు. ఆజన్మాంతం అభిమానులకు రుణపడి ఉంటాను. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ ఫంక్షన్‌కి వచ్చిన కె.టి.ఆర్‌ను చూస్తే సంతోషంగా ఉంది. నేను, తను శాసనసభలో బెంచ్‌ మేట్స్‌. మృదు భాషి. కుశల ప్రశ్నలు వేస్తుండేవారు. వినయ విధేయ రాముడు కె.టి.ఆర్‌గారే అనిపించినా.. ఆయన తన మాటల తూటాలతో ప్రత్యర్థుల నోళ్లు మూయించే డైనమిజం ఉన్న మనిషి. అంతర్జాతీయ వేదికలపై తన తీరు చూసి డేరింగ్‌, డైనమిక్‌ పర్సన్‌లా కనపడ్డారు. నన్ను స్టార్టింగ్‌లో డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌ హీరో అనేవారు. ఇప్పుడు ఆ మూడు పదాలు కె.టి.ఆర్‌ అనే మూడు అక్షరాలకు సరిగ్గా సరిపోతాయి. బాధ్యత ఏదైనా తీసుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరని జి.హెచ్‌.ఎం.సి ఎన్నికలతో పాటు రీసెంట్‌ ఎన్నికల్లోనూ నిరూపించారు. సినిమా విషయానికి వస్తే.. రంగస్థలం షూటింగ్‌ సమయంలో రాంచరణ్‌తో తదుపరి సినిమా ఏం చేస్తే బావుంటుందనే డిస్కషన్‌ చేశాను. మాస్‌ను అలరించేలా ఫ్యాన్స్‌కు కిక్‌ ఎక్కించేలా సినిమా చేయమని చెప్పాను. అప్పుడు అలాంటి లైన్‌ను బోయపాటిగారి దగ్గర విన్నాను అని తను చెప్పాడు. పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌ .. డెఫనెట్‌గా అలాంటి డైరెక్టర్‌ మాస్‌ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నేను ప్రోత్సహించాను. అలా బోయపాటిగారు లైన్‌లోకి వచ్చారు. ఫ్యామిలీ ప్రొటెక్టర్‌గా కథ వినగానే నాకు గ్యాంగ్‌ లీడర్‌ గుర్తుకొచ్చింది. నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. సినిమా రషెష్‌ చూశాను. ఆకట్టుకుంది. మాస్‌కు సంబంధించి చరణ్‌ను హైట్స్‌లో చూపించారు. చరణ్‌ డైలాగ్స్‌, ఫైట్స్‌ చక్కగా కుదిరాయి. ట్రైలర్‌లోని డైలాగ్స్‌ చూసి శభాష్‌ అన్నాను. బోయపాటి తనతో అంత గొప్పగా చేయించాడు. దాన్ని చరణ్‌ తెరపై అంత బాగా చేశాడు.

అందరూ అలరించేలా, శభాష్‌ అనిపించుకునేలా సినిమా ఉంటుందని చెప్పగలను. దేవిశ్రీ చక్కగా మ్యూజిక్‌ అందించారు. డిఫరెంట్‌ సాంగ్స్‌ ఉన్నాయి. రంగస్థలంకు తగ్గకుండా ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించాడు. తనకు అభినందనలు. బోయపాటి కథాపరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. అజర్‌ బైజాన్‌లో అత్యద్భుతంగా సన్నివేశాలను తెరకెక్కించారు. ఆయనకు దానయ్య డి.వి.వి వెన్నుదన్నుగా నిలిచారు. చరణ్‌ను సపోర్ట్‌ చేస్తూ నిలిచిన ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌, రవివర్మ, స్నేహ ఇతర నటీనటులు, హీరోయిన్‌ కియరా అద్వాని గ్లామర్‌తో పాటు డాన్స్‌తో మెప్పించింది. అలాగే రిషి పంజాబి, అర్థర్‌ విలన్స్‌ సహా టెక్నీషియన్స్‌కు అభినందనలు. దానయ్యగారిని నిర్మాతగా సక్సెస్‌ సాధిస్తారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. నిర్మాత దానయ్య ఎంతో అదృష్టవంతుడు. 2018లో భరత్‌ అనే నేను, 2019లో వినయవిధేయరామ, 2020లో ట్రిపుల్‌ ఆర్‌ ఆపజయం ఎరుగని రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఏ నిర్మాతకు రాని అవకాశం తనకు వచ్చింది. సినీ పరిశ్రమలో నిర్మాతలు ఏమిటీ దానయ్య అని ఈర్షపడేలా ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. ఆయన సమర్ధతో, సామర్థ్యంతో, మంచితనంతో అవకాశాలు వస్తున్నాయి. ఆయనకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఆయనతో ఓ సినిమా చేయాలని అనుకున్నాను. అయితే అది చాలా త్వరగానే కుదిరింది. మాటల మాంత్రికుడు, పవన్‌కల్యాణ్‌కు అత్యంత ఆప్తుడు, నాకు ఆత్మీయుడైన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో దానయ్యగారు సినిమా ప్లాన్‌ చేశారు. దానికి నేను కూడా ఎస్‌ అన్నాను. ఈ కాంబినేషన్‌ను సెట్‌ చేసింది కూడా రాంచరణే. మంచి ప్రొడ్యూసర్‌ని ఇచ్చిన రాంచరణ్‌కి థాంక్స్‌. త్రివిక్రమ్‌గారితో సినిమా చేయాలని నాకు అభిలాష. మా కాంబినేషన్‌లో చక్కటి సినిమా వస్తుంది. తమ్ముడు పవన్‌, స్విజర్లాండ్‌లో ఉన్నాడు. యూనిట్‌కు అభినందనలు” అన్నారు.

తెలంగాణ మంత్రి, టి.ఆర్‌.ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.టి.ఆర్‌ మాట్లాడుతూ – ”స్వయంకృషితో తెలుగు పరిశ్రమలోనే కాదు.. భారత సినీ పరిశ్రమలో ఎదిగిన దిగ్గజం చిరంజీవిగారు. సముద్రమంతా అభిమానాన్ని, అద్భుతమైన వారసులను ఇండస్ట్రీకి అందించారు. సోదరుడు చరణ్‌ ధృవ సినిమా గురించి ఇదే వేదికపై మాట్లాడాను. ఆ సినిమా చాలా పెద్ద హిట్‌ అయ్యింది. రంగస్థలం సినిమాను చరణ్‌ చేస్తున్నప్పుడు తను గడ్డం పెంచుకున్నాడు. ఓసారి తనను బయట కలుసుకున్నాను. ఏ సినిమా చేస్తున్నావని అడిగాను. తను గ్రామీణ నేపథ్యంలో సినిమా చేస్తున్నానని చెప్పాడు. చరణ్‌ నాకు అర్బన్‌ కుర్రాడిగానే తెలుసు. కాబట్టి నేను ఆ సినిమా చూడనని చెప్పాను. కానీ సినిమా చాలా పెద్ద హిట్‌ అయిందని, గొప్పగా ఉందని స్నేహితులంతా చెబితే సినిమా చూశాను. చరణ్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఫిలిం. ఆ సినిమాలోని ఆ గట్టునుంటావా? ఈ గట్టుకొస్తావా? అనే పాటను నేను ఎలక్షన్‌ టైంలో కూడా ఉపయోగించుకున్నాను. దేవిశ్రీగారి మ్యూజిక్‌ చాలా బావుంది. బోయపాటికి ఆల్‌ దిస్ట్‌. ఈ సినిమా మెగాభిమానులకు ఫీస్ట్‌లా ఉంటుంది. ఇండ్రస్టీలో అంచెలంచెలుగా ఎదుగుతున్న చరణ్‌గారికి నా అభినందనలు. పవన్‌కల్యాణ్‌గారిని ఈ మధ్య రెండు, మూడుసార్లు కలుసుకున్నాను. అభిమానుల కోసం ఆయన సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ రాణించాలని కోరుకుంటున్నాను. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ మాట్లాడుతూ – ”ప్రియతమ నేత, గ్రేట్‌ లీడర్‌, యూత్‌కి ఇన్‌స్పిరేషన్‌ అయిన కె.టి.ఆర్‌గారికి తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనందుకు నా అభినందనలు. ఆయన నా స్నేహితుడని చెప్పుకోవడానికి గర్వపడతాను. చాలా లవబుల్‌ పర్సన్‌. ఆయన ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. బాస్‌ అనాలో, మెగాస్టార్‌ అనాలో, అన్నయ్యగారనాలో తెలియడం లేదు. నేనైతే నాన్నగారనే అంటున్నాను. సినిమా విషయానికి వస్తే ఈ కథను బోయపాటిగారు నాలుగేళ్ల క్రితమే చెప్పారు. నాలుగేళ్లు తను ఆలోచించి ఈ స్క్రిప్ట్‌ను ఆలోచించి ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో డిసిప్లెయిన్డ్‌ సెట్‌ బోయపాటిగారిదే. ఏ హీరో అయినా తన కెరీర్‌లో బోయపాటిగారితో పనిచేయాలనుకుంటాడు. ఈసినిమాలో నాకు మంచి మెమొరీస్‌ ఉన్నాయి. దేవిశ్రీతో చేసిన సినిమాలన్నీ హిట్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుంది. ఇప్పటి నుండి భారీ సినిమాలంటే దానయ్యగారే గుర్తుకొస్తారు. ఆయనకు థాంక్స్‌. కియరా చాలా హార్డ్‌ వర్కర్‌. బెస్ట్‌ డాన్సింగ్‌ పార్ట్‌నర్‌. స్నేహగారు అద్భుతమైన, హంబుల్‌ క్యారెక్టర్‌ చేశారు. ఈ సినిమా ఔట్‌ అండ్‌ ఔట్‌ బ్యూటీఫుల్‌ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. యాక్టర్‌గా ఫుల్‌ప్లెజ్డ్‌ సినిమాలు చేయాలని ఈ సినిమా ఒప్పుకున్నాను. ఈ జోనర్‌ నాకు కొత్త. అభిమానుల కోసమే ఈ జోనర్‌లో సినిమా చేశాను. పవన్‌కల్యాణ్‌ బాబాయ్‌ సినిమాలను వదిలిపెట్టి సమాజం కోసం కష్టపడటం చూస్తుంటే బాధగానూ, సంతోషంగానూ ఉంది. ఇతరుల బాధ తీర్చడానికి ఓ వ్యక్తి యుద్ధం చేస్తున్నాడని గర్వంగా ఉంది. కెమెరా మెన్స్‌ రిషి పంజాబి, అర్థర్‌ విల్సన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎ.ఎస్‌.ప్రకాశ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి, రత్నంగారు సహా అందరికీ థాంక్స్‌. ఈ సినిమాకు మా నాన్నగారితో పాటు ప్రేక్షకులు, మెగాభిమానుల ఆశీర్వాదాలుంటాయని భావిస్తున్నాను” అన్నారు.

మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను మాట్లాడుతూ – ”కె.టి.ఆర్‌గారిది చాలా పెద్ద మనసు. అలాగే రాంచరణ్‌ను మనమేదైనా అడిగితే.. అవసరం అనుకుంటే మన కడుపులోనుండైనా తీసిచ్చే మంచి మనిషి. అందుకే వారిద్దరూ దగ్గరి మనుషులయ్యారు. వారసత్వం అనేది అసమర్దుడికి బరువు. సమర్దుడికి బాధ్యత. కె.సి.ఆర్‌గారి వారసుడిగా కె.టి.ఆర్‌గారు.. చిరంజీవి వారసుడిగా చరణ్‌ ఇద్దరూ కలిసి ఓ బాధ్యతను నిర్వహిస్తున్నారు. వారిద్దరూ ఓ వేదికపై ఉండటం ఆనందంగా ఉంది. టైటిల్‌ కె.టి.ఆర్‌గారికి సరిగ్గా సరిపోతుంది. ఇక చిరంజీవిగారి విషయానికి వస్తే, మార్గదర్శకులు. ఒక సమర్దుడు నిలబడితే వంద మంది సమర్దులను నిలబెట్టగలుగుతాడు. అందుకు నిట్ట నిలువు ఉదాహరణ చిరంజీవిగారు. ఆయన తన కెరీర్‌లో ఎన్నో దారులు వెతుక్కుంటూ వెళ్లి.. ఆయన తన వారసులకే కాదు, ఇండస్ట్రీలో చాలా మందికి రహదారి వేశారు. ప్లాట్‌ఫాం చేసిన చిరంజీవిగారు కొన్ని రోజులు పక్క నుండి రికార్డులు క్రియేట్‌ చేయమని అన్నారు. తర్వాత మళ్లీ ఆయన వచ్చి అన్ని రికార్డులను కొల్లగొట్టి నవ్వుతూ నిలబడ్డారు. ఇప్పుడు మళ్లీ సైరా అని అంటున్నారు. ఆయన ఉంటే మనకు మంచిది. ఆయన మేలుకువగా ఉంటే మేం కూడా మేలుకువగా ఉంటాం. సినిమా విషయానికి వస్తే.. అజర్‌బైజాన్‌ దేశంలో షూట్‌ చేశాం. అక్కడి ప్రభుత్వానికి, అందరికీ థాంక్స్‌. సినిమాలోపని చేసిన ప్రతి ఆర్టిస్ట్‌ వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేశ్‌, స్నేహ, హిమజ అందరూ ఓ ఫ్యామిలీగా నటించారు. నటించిన అందరికీ థాంక్స్‌. దేవిశ్రీ ప్రసాద్‌గారితో ఐదు సినిమాలు చేశాను. ఐదు సినిమాలు ఐదు అద్భుతాలని చెప్పగలను. అలాగే రత్నంగారు, కెమెరా మెన్‌ రిషి పంజాబి, అర్థర్‌ విల్సన్‌, యాక్షన్‌ కంపోజ్‌ చేసిన కనల్‌ కణ్ణన్‌గారికి, ఎ.ఎస్‌.ప్రకాష్‌, చంటి, తమ్మిరాజు, ప్రేమ్‌రక్షిత్‌, శంకర్‌, శోభిగారికి థాంక్స్‌. చరణ్‌ను ఆర్టిస్ట్‌గా ఏంటో మరోసారి సినిమాలో చూస్తారు. తప్పకుండా అందరూ గొప్పగా మాట్లాడుకునేలా ఉంటుంది. అందరూ గుండెపై చెయ్యి వేసుకుని చూడండని అందరి అభిమానులకు ఒక్క హామీ ఇస్తున్నాను” అన్నారు.

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ – ”చిరంజీవిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన్ను చూసి మేమెంతో ఇన్‌స్పైర్‌ అవుతుంటాం. నా కెరీర్‌ ముందు నుండి నన్ను పుష్‌ చేస్తూనే ఉంటారు. రాంచరణ్‌ నా స్వంత సోదరుడితో సమానం. నేను చరణ్‌కు మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తున్నప్పుడు చిరంజీవిగారిని ఉహించుకుని మ్యూజిక్‌ చేస్తూ వచ్చాను. తన వాయిస్‌, డాన్స్‌ చూసి చిరంజీవిగారిని చూస్తున్నట్లే అనిపించింది. తస్సదియ్యా సాంగ్‌లో చెర్రీ డాన్స్‌ చూసి ఫ్యాన్స్‌ కూడా డాన్స్‌ చేస్తారు. బోయపాటిగారితో ప్రతి సినిమాకు పనిచేశాను. సినిమాలు పాటలు బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. సినిమాలు కూడా హిట్‌ అయ్యాయి. మంచి టేస్ట్‌ ఉన్న దర్శకుడు. ఎంత మాస్‌ సినిమా అయినా లాజిక్‌ను మిస్‌ చేసుకోరు. దానయ్యగారికి థాంక్స్‌. ఆయన బ్యానర్‌లో భరత్‌ అనే నేను తర్వాత మరోసారి పనిచేయడం ఆనందంగా ఉంది. కె.టి.ఆర్‌గారికి థాంక్స్‌” అన్నారు.

ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ మాట్లాడుతూ – ”చిరంజీవిగారు, కె.టి.ఆర్‌గారి సమక్షంలో ఫంక్షన్‌ జరుగుతుంది. పవన్‌కల్యాణ్‌ దగ్గర నుండి అల్లు అర్జున్‌, రావమ్‌చరణ్‌, తేజ్‌, వరుణ్‌, అల్లు శిరీష్‌ సహా అందరికీ ఆయన వేసిన బాట తప్ప మరేదీ కనపడటం లేదు. వీళ్లందరి కెరీర్‌కు సహాయపడ్డ మెగాస్టార్‌ చిరంజీవిగారికి థాంక్స్‌. ఈ వేడుక చూస్తుంటే ఇదేదో సక్సెస్‌ మీట్‌లా అనిపిస్తుంది. ఈ సినిమాలో లేనిదే లేదు అనిపిస్తుంది. రాంచరణ్‌, బోయపాటి, దేవిశ్రీ వంటి దిగ్గజాలు ఈ సినిమాను చేశారు. టీజర్‌ను చూస్తుంటే గుజ్‌బాంబ్స్‌ వస్తున్నాయి. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్స్‌. ఈ సినిమా విజయోత్సాహం పండుగలో పండుగలా ఉంటుంది” అన్నారు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ”టైటిల్‌ చాలా బాగా నచ్చింది. రాముడు మర్యాదు పురుషోత్తముడు. రాముడు తల్లి దగ్గర ఎంతో ప్రేమగా ఉంటాడు.. తండ్రి దగ్గర సంస్కారంగా ఉంటాడు. శత్రువు దగ్గర అంత భయంకరంగా ఉంటాడు. అది టైటిల్‌లో కనిపంచలేదు కానీ.. సినిమాలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. బుక్‌లోని వేల్యూస్‌ పాటించే వాళ్లు బోరింగ్‌గా ఉంటుందని అనుకుంటారు. కానీ అలాంటి వారిని గొప్పగా చూపించే దర్శకుల్లో బోయపాటిగారు ఒకరు. ఆయనలో నచ్చే లక్షణం నాకు అదే. రాముడు అంటే బోరింగ్‌ కాదు.. అందుకే ఇన్నేళ్లు గడిచినా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మాట్లాడుకుంటూనే ఉంటాం. అలాంటి హీరోలా ఈ సినిమాలో మన హీరో కనపడతాడు. మరో విషయం చెప్పాలంటే ఒక కోట.. ఆ కోట లోపల స్వర్గంలా ఉంటుంది. ఆ కోటకు వెళ్లే దారి మధ్యలో చిన్న బ్రేక్‌ కూడా లేకుండా వెళ్లే దారి ఉంటుంది. అలాంటి కోట కట్టి, దారి వేసిన చిరంజీవిగారి కుటుంబం మన అందరి కుటుంబం అయిపోయింది. ఆయన తమ్ముడు మన ఇంట్లో మనిషి అయిపోయాడు. వాళ్ల అబ్బాయి మన ఇంట్లో అబ్బాయిగా మారిపోయాడు. అలాంటి స్వర్గంలాంటి కోటను కట్టిన చిరంజీవిగారి గురించి మాట్లాడుకోవాలంటే మాటలు వెతుక్కోనక్కర్లేదు. రామాయణం అధికారికంగా మూడు వందల వెర్షన్స్‌ ఉన్నాయి. కొన్ని కథలు ఎన్ని సార్లు విన్నా బోర్‌ కొట్టదు. గాంధీ గురించి ఎన్ని సార్లు విన్నా బోర్‌ కొట్టదు. రామాలయం లేని వీధి ఉండదు. ఆంజనేయ స్వామి గురించి మాట్లాడకుండా మనం ఉండం. అలాంటి ఆంజనేయస్వామి భక్తుడైన చిరంజీవిగారి గురించి మాట్లాడకుండా సౌత్‌ ఇండియన్‌ సినిమా ఉండదు. క్యూలో నిలబడగి చొక్కా చిరిగిపోయిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇబ్బందితో సినిమా థియేటర్‌లోకి వెళితే దాన్ని మరచిపోయేలా చేసిన చిరంజీవిగారికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం. ఆయన మనకు అందించిన నవ్వులకు, స్టెప్పులకు, మనం అరిచిన అరుపులకు మనం ఏమివ్వగలం. మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్‌లో మునిగి తేలడం కంటే.. రోడ్డు చివరన కూర్చుని అమ్మాయిలను ఏడిపించడం కంటే, థియేటర్‌లో కూర్చుని ఓ హీరోను చూసి ఇన్‌స్పైర్‌ కావడం చాలా మంచి విషయం. అలాంటి మంచి విషయాన్ని నాకు అందించి, నేను పాడుకాకుండా కాపాడిన చిరంజీవిగారికి నా కృతజ్ఞతలు. నాలాంటి ఎంతో మందిని ఆయన దారిలో పెట్టారు. సౌతిండియాలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరో అని చదివిన నేను నీతిగా, నిజాయితీ, మిడిల్‌క్లాస్‌ నుండి, ఓ పోలీస్‌ ఆఫీసర్‌ కొడుకు అయ్యుండి, ఇంత ఉన్నతి స్థాయికి రాగలిగారు. అలాంటప్పుడు నేను కూడా ఈస్థాయికి రాగలను అని సినిమాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నాను. అలా పాజిటివ్‌ దృక్థం నాలో కలిగించిన చిరంజీవిగారికి థాంక్స్‌. మెగాస్టార్‌గారి తమ్ముడు మనందరికీ మనందరికీ ఆత్మీయుడు. అలాంటి పవన్‌కల్యాణ్‌కు కొడుకు వరుసైన రాంచరణ్‌కి ఈ సినిమా మరింత విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. కొన్ని సినిమాలు హిట్స్‌ ..సూపర్‌హిట్స్‌.. బ్లాక్‌బస్టర్స్‌ అవుతాయి. కానీ కొన్ని సినిమాలు సినిమాలు తీసేవారి ఆలోచనలనే మారుస్తాయి. అలా మార్చిన సినిమా రంగస్థలం. కొన్ని సినిమాలు తీసిన వారికి గౌరవాన్ని.. చూసిన వారికి తృప్తిని తీసుకొస్తాయి. అలాంటి ‘రంగస్థలం’ సినిమా చేసిన రాంచరణ్‌కి ఈ ఏడాది చాలా తీపి గుర్తుగా మిగిలిపోయింది. ఈ ఏడాది మరింత తీపిగా, ఉన్నంతగా ఉండాలని చరణ్‌కు శుభాకాంక్షలు. చరణ్‌ సింహంలాంటోడు. తను కొడితే ఇక తిరుగుండదు” అన్నారు.

హీరోయిన్‌ కియరా అద్వాని మాట్లాడుతూ – ”చిరంజీవిగారు, కె.టి.ఆర్‌గారున్న స్టేజ్‌పై నేను మాట్లాడుతుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మాస్‌ హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన బోయపాటిగారికి థాంక్స్‌. అమేజింగ్‌ జర్నీ. రాంచరణ్‌ను నేను ఆర్‌.సిగాపిలుస్తాను. ఆయనతో పనిచేసేరోజు నటిగా నేను బెటర్‌ అవుతూ వచ్చాను. హంబుల్‌ పర్సన్‌. తనతో పనిచేయడం డ్రీమ్‌లా ఉంది. తనతో పనిచేయడం ఆనందంగా, గౌరవంగా ఉంది” అన్నారు.

యలమంచిలి రవి మాట్లాడుతూ – ”రంగస్థలం’ తర్వాత మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌ను ఎలా చూడాలో ఈ సినిమాలో అలా జనవరి 11న చూడబోతున్నారు. మా సినిమాను మించి ఈ సినిమా ఉంటుంది. ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌” అన్నారు.

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ – ”సాధారణంగా బోయపాటి సినిమా అంటే పక్కా యాక్షన్‌ మూవీ అనుకుంటాం. ఈ సినిమా చూస్తుంటే ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తుంది. మా చరణ్‌బాబుకు ఇది మరో ముఠామేస్త్రి, గ్యాంగ్‌లీడర్‌ కావాలని కోరుకుంటున్నాను. దానయ్యగారికి ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.