ఏపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌

ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడి లోని ఏపీ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా సీఎం జగన్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తరువాత ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) నారాయణస్వామి , రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్ , ఉషశ్రీ చరణ్ , దాడిశెట్టి రాజా , ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు , మేకతోటి సుచరిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు , మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి , ఎమ్మెల్యే జక్కంపూడి రాజా , కొలుసు పార్థసారథి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ, వైస్సార్సీపీ నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఒక్కో అభ్యర్థి విజయానికి అవసరమైన 22 మంది ఎమ్మెల్యేలను ఒక బృందంగా అధికార వైస్సార్సీపీ ఏర్పాటు చేసింది. శాసన సభ్యులంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల తరువాత ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇప్పటి వరకు 35 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేసినట్లు సమాచారం.