ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవానికి జగన్ కు ఆహ్వానం

ఈ నెల 15 న ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్‌ రమణ ప్రసాద్‌. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్‌ రమణ ప్రసాద్‌ లు సీఎం జగన్ ను కలిశారు.

ఈ సందర్భంగా ఏప్రిల్‌ 15న జరగనున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి అందజేశారు. వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ, ప్రసాదాలు అందించారు. కాగా 15 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు పున్నమి వెన్నెల్లో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది.

రెండు రాష్ట్రాలు విడిపోక ముందు శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలంలో ఎంతో ఘనంగా జరిగేవి.అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కళ్యాణం జరిపిస్తారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణం శ్రీరామ నవమి రోజు కాకుండా పౌర్ణమి రోజు జరిపిస్తారు.

ఇక రాములవారి కల్యాణానికి దాదాపు రెండు లక్షల మంది హాజరు కావొచ్చని అంచనా వేశామని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక కోవిడ్ కారణంగా రెండేళ్లుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేరకు ఈ సారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రకృతి ఇబ్బందులు తలెత్తినా భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా కల్యాణం నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు.

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో ఇప్పటి వరకు సుమారు 63 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామన్నారు. అవసరమైన మేరకు నిధులు వెచ్చించి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ఒంటిమిట్ట‌లో టీటీడీ 4.3 కోట్లతో నిర్మించిన భక్తుల వసతి సముదాయం, కార్యాలయాల సముదాయం, అతిథి గృహం యాత్రికుల వసతి సముదాయాలను జిల్లా పరిషత్ ఛైర్మన్ అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే మల్లిఖార్జునరెడ్డితో కలసి శుక్రవారం వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.