విషాదం : వైస్సార్సీపీ ప్లీనరీ నుండి తిరిగెళ్తూ ప్రమాదానికి గురై వాలంటీర్ మృతి

వైస్సార్సీపీ ప్లీనరీ నుండి ఇంటికి తిరిగెళ్తూ కాకాని వద్ద బస్సు ఢీకొని వాలంటీర్ మృతి చెందారు. మృతి చెందిన యువకుడిని దినేష్‌గా గుర్తించారు. దినేష్‌ స్వస్థలం బాపట్ల జిల్లా అమృతలూరు మండలం గోవాడ గ్రామం. వాలంటీర్‌గా పనిచేస్తున్న దినేష్.. శుక్రవారం ఉదయం ప్లీనరీకి వచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ప్లీనరీ ప్రాంగణం నుంచి గ్రామానికి వెళ్తుండగా కాకాని వద్ద బస్సు ఢీకొని మృతి చెందాడు. ఇక సమావేశాలు పూర్తి కాగానే ఒక్కసారిగా కార్యకర్తలు రోడ్లపైకి రావడం తో గుంటూరు – విజయవాడ హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.

శనివారం వైస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు ముగిసాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. అలాగే వైస్సార్సీపీ పార్టీకి జీవితకాలపు అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండో రోజు జగన్ సంక్షేమ పథకాల గురించి , రాష్ట్ర అభివృద్ధి గురించి , జగన్ పాలన గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. తన ప్రసంగంలోనూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి చేసిన పనుల గురించి , సంక్షేమ పథకాల గురించి వివరించారు. మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో అవన్నీ అమలు చేస్తూ వస్తున్నట్లు తెలిపారు. నా ఫోకస్‌ అంతా ప్రజలకు మంచి చేయడమే. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 151కి చేరిందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అలాగే వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా అక్కా చెల్లెమ్మలకు రూ. 9,180 కోట్లు ఇచ్చామని , వైఎస్సార్‌ ఆసరా ద్వారా అక్కా చెల్లెమ్మలకు రూ. 12, 758 కోట్లు ఇచ్చామని , మూడేళ్లలో వ్యవసాయం రంగంపై రూ. లక్షా 27వేల కోట్లు ఖర్చు చేశామని జగన్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు కోసం రూ. 45 వేల కోట్లు ఖర్చు చేసినట్లు , ఉచిత విద్యుత్‌ కోసం రూ. 27వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మూడేళ్లలో ఒక్క రైతు భరోసా ద్వారానే రూ. 23,875 కోట్లు ఇచ్చినట్లు జగన్ తెలిపారు. మూడేళ్లలో మ్యానిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేశాం ఈ సందర్బంగా తెలిపారు.

అలాగే మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీని ఎదురించిన ఏకైక మొనగాడు సీఎం జగన్‌ అని చెప్పుకొచ్చారు. ఇక టీడీపీని బంగాళాఖాతంలో కలిపేశామన్నారు. ఇక కొడాలి నాని సైతం తనదైన శైలిలో చంద్రబాబు ఫై నిప్పులు చెరిగి , మరోసారి వైసీపీ కార్యకర్తల్లో ఉత్సహం నింపారు. అలాగే మిగతా నేతలంతా కూడా జగన్ పాలన గురించి ప్రసంగించారు.