మంత్రి బొత్స కాళ్లు మొక్కిన ఐఏఎస్ అధికారి

ఈ మధ్య ఐఏఎస్ అధికార్లు ముఖ్యమంత్రిల కాళ్లు , మంత్రుల కాళ్లు మొక్కడం అలవాటుగా మారింది. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లను సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు మొక్కి వార్తల్లో నిలువగా…తాజాగా విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచారు. జనవరి 1న న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. మంత్రికి బొకే ఇచ్చిన ఆయన.. వంగి కాళ్లకు నమస్కరించారు. ఐఏఎస్ హోదాలో ఉండి ఇలా ప్రజాప్రతినిధి కాళ్లు మొక్కడం ఏంటని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారు షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి.. ప్రజా ప్రతినిధి కాళ్లు మొక్కుతారా ? అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

గత ఏడాది ఏప్రిల్‌లో లాక్‌డౌన్ అమలు సమయంలో ఇదే జాయింట్ కలెక్టర్ తన పనితీరుతో అందరి ప్రశంసలు పొందారు. జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మారు వేషంలో కూరగాయల మార్కెట్లను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించినట్లు కాకుండా.. ఇష్టానుసారంగా ధరలు పెంచారనే ఫిర్యాదులు రావడంతో.. విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లలో సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరల గురించి వాకబు చేశారు. అలాగే కొనుగోలుదారులను అడిగి ధరల వివరాలు ఆరా తీశారు.