వివేకా హ‌త్య కేసు..పులివెందుల కోర్టుకు ద‌స్త‌గిరి

వివేకా కేసులో సీబీఐ దూకుడు..ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్ట్ చేసిన సీబీఐ

కడప : క‌డ‌ప మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ మ‌రింత వేగం పెంచింది. హైకోర్టు ఆదేశాల‌తో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్ప‌టికే చాలా మందిని విచారించింది. నెల‌ల త‌ర‌బ‌డి క‌డ‌ప‌లోనే మ‌కాం వేసిన సీబీఐ బృందం అన్ని కోణాల్లో ఈ కేసును ద‌ర్యాప్తు చేసింది. అంతేకాకుండా ఇప్ప‌టికే వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్ యాద‌వ్‌లు స‌హా మ‌రికొంద‌రిని అరెస్ట్ చేసింది.

ఇప్ప‌టికే రెండు నివేదిక‌ల‌ను కోర్టుకు స‌మ‌ర్పించిన సీబీఐ సోమ‌వారం నాడు మ‌రో కీల‌క అడుగు వేసింది. వివేకా వ‌ద్ద కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన ద‌స్త‌గిరిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అత‌డిని పులివెందుల కోర్టులో హాజ‌రుప‌రిచింది. ఇప్ప‌టికే ద‌స్త‌గిరి నుంచి ఓ ద‌ఫా వాంగ్మూలాన్ని న‌మోదు చేసిన సీబీఐ తాజాగా మ‌రోమారు అత‌డి నుంచి వాంగ్మూలం న‌మోదు చేసింది. ఈ ప‌రిణామంతో వివేకా కేసులో సీబీఐ మ‌రింత దూకుడు పెంచింద‌ని, త్వ‌ర‌లోనే ఈ కేసు చిక్కుముడిని సీబీఐ విప్ప‌నుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/