బెంగళూరులో హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఆత్మహత్య

Hyderabad techie suicide in bengaluru
Hyderabad techie suicide in bengaluru

బెంగళూరు: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో ఉప్పల్‌కు చెందిన గున్ రెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్‌లోని గణేష్ నగర్‌కు చెందిన గున్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రంజిత్ కుమార్ రెడ్డి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లాడు. శ్రీనివాస్ రెడ్డికి ఒకే ఒక కుమారుడు కావడంతో తల్లిదండ్రులు కూడా అతడితోపాటే బెంగళూరుకు వెళ్లి ఉంటున్నారు. కాగా, రెండ్రోజుల క్రితం బంధువుల ఇంట్లో శుభకార్యానికి రంజిత్ తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రంజిత్ కుమార్ రెడ్డి బెంగళూరులోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, రంజిత్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. రంజిత్ కుమార్ మరణవార్త విని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/