విరూపాక్ష టీజర్ విడుదల వాయిదా..ఎందుకంటే

సాయి ధరమ్ తేజ్ – సంయుక్త జంటగా కార్తీక వర్మ దండు డైరెక్షన్లో సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం విరూపాక్ష . ఆక్సిడెంట్ తరువాత తేజ్ నటించిన మూవీ ఇది. ఈ సినిమా తాలూకా షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ఫై దృష్టి పెట్టారు. ఇప్పటీకే ఈ సినిమా తాలూకా గ్లింప్స్‌ విడుదల చేయగా మంచి ఆదరణ లభించింది. ఈ గ్లింప్స్‌ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. గంభీరమైన స్వరంతో అతడు ‘అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’ అంటూ పలికిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.

తాజాగా ఈ మూవీ తాలూకా టీజర్ ను ఈరోజు అంటే మార్చి 1న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే దీన్ని వాయిదా వేసినట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. మెగా అభిమాని, సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావూరి పండు మరణించారు. భీమవరానికి చెందిన రావూరి పండు మృతికి సంతాపంగా, నివాళులు అర్పిస్తూ విరూపాక్ష టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చూసేసిన ఈ టీజర్ చాలా బాగుందని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తోపాటు మూవీ యూనిట్ ను అభినందించారు. ఈ టీజర్ రిలీజ్ డేట్ ను మరోసారి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా గా ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదల చేయబోతున్నారు.