టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఈ టోర్నీ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడెనిమిది ఏళ్ల నుంచి తనపై ఒత్తిడి పెరిగిపోయిందని కాబట్టి పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి రాజీనామా చేస్తున్నానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు.

2014లో మహేంద్రసింగ్ ధోనీ నుంచి టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న కోహ్లీ.. 2017 నుంచి వన్డే, టీ20 కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టాడు. కానీ.. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ జట్టు కనీసం ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో.. కోహ్లీకి కెప్టెన్సీ కలిసిరాలేదనే అభిప్రాయానికి బీసీసీఐ పెద్దలు వచ్చేసినట్లు తెలుస్తోంది.

టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోనుండడంతో తదుపరి సారథి ఎవరన్న దానిపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ విషయంలో రోహిత్ శర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే కోహ్లీ లేని సమయాల్లో కెప్టెన్‌గా ఉండి నిదహాస్ ట్రోఫీలో భారత్ జట్టుని విజేతగా నిలిపాడు. అంతే కాకుండా అతని కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్ ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. సో టీ20 కెప్టెన్‌గా రోహిత్ పేరు ప్రకటిస్తారు కావొచ్చు.