త్వరలోనే గ్రామ దవాఖానలు ఏర్పటు చేస్తామని కేసీఆర్ ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు తెలిపారు. రాష్ట్రంలో త్వ‌ర‌లోనే ప‌ల్లె ద‌వాఖాన‌లు ప్రారంభం చేస్తామ‌ని శాస‌న‌స‌భ వేదిక‌గా కేసీఆర్ ప్ర‌క‌టించారు. హైదరాబాద్‌ నగరంలోని బస్తీ దవాఖానల తరహాలోనే… గ్రామ దవాఖాన లు కూడా త్వరలోనే రాబోతున్నాయని ప్రకటించారు. ఈ గ్రామ దవాఖానల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 350 బ‌స్తీ ద‌వాఖాన‌లు ఏర్పాటు చేయాల‌ని టార్గెట్ ఇచ్చాను. డివిజ‌న్‌కు రెండు చొప్పున ఏర్పాటు చేయాల‌ని చెప్పాను. కొన్ని బ‌స్తీల్లో మూడు పెట్టాల‌ని చెప్పాను. మొత్తానికి న‌గ‌రంలో బ‌స్తీ ద‌వాఖాన‌లు నిరుపేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు కొత్త‌గా ఆరోగ్య స‌దుపాయాలు పెంచాలనే ఉద్దేశంతో ప‌ల్లెల్లో ద‌వాఖాన‌లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. క‌రోనా, స్వైన్ ఫ్లూ లాంటి వైర‌స్ వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌ల్లె ద‌వాఖాన‌లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించాం. త్వ‌ర‌లోనే ఈ ద‌వాఖాన‌లు వ‌స్తాయి. అన్ని ఏర్పాట్లు జ‌రిగాయి. కొద్ది రోజుల్లోనే ప్రారంభం అవుతాయని కేసీఆర్ స్పష్టం చేసారు. 12,769 గ్రామాల్లో 9 వేల కార్యదర్శుల పోస్టులు కొత్తవి వేశామని.. అన్ని పోస్టులకు ప్రమోషన్ కూడా ఇచ్చేశామని తెలిపారు. వారం కంటే ఎక్కువ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉండొద్దు అని కలెక్టర్ లకు చెప్పామని వెల్లడించారు.