ఈ నెల 20న ఉక్కు పోరు యాత్ర..విజయసాయిరెడ్డి

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమే

అమరావతి: ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందని వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న సిఎం జగన్ ఇప్పటికే ప్రత్యామ్నాయ విధానాలను సూచించారని వెల్లడించారు.

స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడం వాటిలో ముఖ్యమైనదని తెలిపారు. సొంత గనులు ఉంటే ఒక్కో టన్ను ఖనిజంపై గరిష్టంగా రూ.7 వేల వరకు ఆదా అవుతుందని వివరించారు. ఉక్కు పరిశ్రమ రుణాలను ఈక్విటీ కింద మార్చాలని కూడా సిఎం జగన్ ప్రతిపాదించారని, ఈ రెండు ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేస్తే 6 నెలల్లో ఉక్కు కర్మాగారం లాభాల బాట పట్టడం ఖాయమని అన్నారు. దీనిపై వైఎస్‌ఆర్‌సిపి గట్టి నమ్మకంతో ఉందని విజయసాయి వివరించారు.

అయితే సిఎం జగన్ చేసిన సూచనలను కేంద్రం ఇప్పటివరకు అంగీకరించలేదని వెల్లడించారు. అందుకే తాము పోరుబాట పడుతున్నామని, ఇకపై ఉక్కు పోరు ఢిల్లీకి వినబడేలా గర్జిస్తామని అన్నారు. ఈ నెల 20న విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట యాత్ర చేస్తున్నామని, విశాఖ పరిధిలోని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేపడుతున్నామని వివరించారు. స్టీల్ ప్లాంట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/