సొంత పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విజయశాంతి

సినీ నటి , బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి సొంత పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ తీరును ఎండగట్టి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న విజయశాంతి మొదటిసారిగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి బిజెపి రాష్ట్ర నాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర నాయకత్వం తనను నిశ్శబ్దంలో ఉంచిందంటూ పేర్కొన్నారు. తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగాలంటూ విజయశాంతి పేర్కొన్నారు.

పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు యాక్టివ్గా లేరంటూ మీడియా అడిగిన ప్రశ్నకు పార్టీ నాయకత్వాన్నే అడగాలంటూ సమాధానం ఇచ్చారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ నేతల దగ్గర స్పష్టత లేదన్నారు. పార్టీలో మాట్లాడడానికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో పార్టీ నాయకులనే అడగాలని తెలిపారు. పార్టీలో తనకు పాత్ర లేకుండా చేయాలనుకుంటున్న వారిని పాతరేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను అసంతృప్తిగా ఉన్నానని మీకు కూడా అన్పిస్తోందా?’’ అంటూ అని మీడియాకు ఎదురు ప్రశ్నలు వేశారు. ఫైర్ బ్రాండ్ను ఎందుకు సైలెంట్లో పెట్టారో బండి సంజయ్ , లక్ష్మణ్ కే తెలియాలన్నారు.

‘‘పని చెప్తే కదా… పార్టీ పని చేసేది. పని ఇవ్వకుండా చేయమంటే నేనేమి చేయాలి. జాతీయ పార్టీతో‌ ఇబ్బంది లేదు.. రాష్ట్ర నాయకత్వమే ఉపయోగించుకోవటం లేదు. సీనియర్ నేతలను కలుపుకుని పోకుంటే పార్టీకే నష్టం. నా వల్ల పార్టీలో కొందరు నేతలు అభద్రతాభావంతో ఉన్నారు. రాష్ట్ర పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టి సారించాలి’’ అని విజయశాంతి అన్నారు. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలం.. ఇవ్వకుండా చేయమంటే ఏం చేయగలం అంటూ విజయశాంతి పేర్కొన్నారు. తన పాత్ర ఎప్పుడూ టాప్‌ పాత్రేనని.. రాములమ్మగా, ఉద్యమకారిణిగా అందరి హృదయాల్లో ఉన్నానని.. తాను పార్లమెంట్‌లో కొట్లాడిన మనిషినంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు.