ప్రభుత్వంపై విజయశాంతి ఆగ్రహం

తెలంగాణ సమాచార, ప్రజా సంబంధాల శాఖలో అవినీతి బట్టబయలైంది.. విజయశాంతి

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి మరోసారి ధ్వజమెత్తారు. ఆవిర్భావ దినోత్సవాల పేరిట రూ.12 కోట్లు స్వాహా అంటూ ఓ పత్రికలో కథనం వచ్చిన నేపథ్యంలో ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2015 నుంచి రెండేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖలో కొనసాగిన అవినీతి పర్వం బట్టబయలైందని వెల్లడించారు. అమరవీరులు, పోరాట యోధులు, బలిదానాలకు ఏమాత్రం విలువ లేకుండా ఉమ్మడి రాష్ట్ర కాలపు అక్రమాలను నేటి తెలంగాణ పాలకులు కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిపై తిరుగులేని సాక్ష్యాన్ని మీడియా బయటపెట్టిందని తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల పేరుతో విదేశీ అడ్వర్టయిజింగ్ డబ్ల్యూపీపీ కంపెనీ భారతీయ విభాగంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కనీస ప్రచారం చేయకుండా రూ.12 కోట్లు… యాడ్స్ పేరుతో మరికొన్ని కోట్లు స్వాహా చేశారని వివరించారు. ఈ సొమ్ములో డీపీఐఆర్ అధికారులకు రూ.7.5 కోట్లు వాటా అందినట్టు జేడబ్ల్యూటీ మైండ్ సెట్ నివేదిక చెబుతోందని వెల్లడించారు. డబ్ల్యూపీపీ సంస్థ విదేశాల్లో అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆ పత్రికా కథనంలో తెలిపారని, ఆ సంస్థ భారత్ లో ఒక్క తెలంగాణలోనే అవినీతికి పాల్పడినట్టు కూడా ఆ కథనంలో వివరించారని విజయశాంతి పేర్కొన్నారు.

ఈ అవినీతి వ్యవహారంలో తెలంగాణ పాలకులకు సంబంధం లేదంటే పసిపిల్లలు కూడా నమ్మరని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో లేదో, ఆ మరుక్షణం నుంచే అవినీతి భాగోతం ప్రారంభించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/