కేసీఆర్ ఫై రాములమ్మ ఆగ్రహం..

కేసీఆర్ ఫై రాములమ్మ ఆగ్రహం..

బిజెపి నేత విజయశాంతి..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రుణమాఫీ అంటూ ఓట్లు దండుకున్న కేసీఆర్ ..ఇప్పుడు రుణమాఫీ చేయకుండా రైతులను బాధపెడుతున్నదని విజయశాంతి ఆరోపించింది. 2018 ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రూపాయల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని ఓట్లు దండుకున్న కేసీఆర్… అధికారంలోకి వచ్చిన తర్వాత, కేవలం కొంతమంది రైతులకు రూ. 25 వేలు మాత్రమే రుణమాఫీ చేశారని చెప్పుకొచ్చింది. ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఇదిగో రుణమాఫీ, అదిగో రుణమాఫీ అంటూ ఓట్లు దండుకొని, గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్ళీ హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనైనా రుణవిముక్తి కలుగుతుందని సంబరపడ్డ రైతుల కళ్ల వెంబడి కన్నీళ్లు కారేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆగస్ట్ 1న జరిగిన కేబినెట్ మీటింగులో మంత్రి హరీష్ రావు రైతు రుణమాఫీకి రూ. 2,006 కోట్లు అవసరమని ప్రతిపాదన చేసి, స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రూ. 50 వేల లోపు ఉన్న రుణాలకు రుణ విముక్తి కల్పిస్తామని ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఆగస్టు 16 నుంచి 31వ తేదీ లోపున వేస్తామని ఆశ పెట్టి… ఆగస్ట్ 26 వరకు కొంతమంది రైతులకు మాత్రమే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వేశారని చెప్పారు. ఆగస్ట్ 26 తర్వాత 4.97 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ. 1,682 కోట్లకు గాను.. ఒక్క రూపాయి కూడా వేయకపోవడంతో తెలంగాణ రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మారిందని మండిపడ్డారు.