కెసిఆర్‌ తప్పులు పెరిగిపోతున్నాయన్న విజయశాంతి

కరోనా అంశంలో కెసిఆర్ చేతులెత్తేశారని విమర్శలు

vijayashanthi
vijayashanthi

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు సిఎం కెసిఆర్‌పై విమర్శలు గుప్పించారు.శిశుపాలుడి తప్పుల్లా సిఎం కెసిఆర్‌ తప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాతీర్పు తనకే అనుకూలం అని విర్రవీగుతున్న దొరగారికి ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొనే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. ప్రతి విషయంలో మాయ మాటలు చెబుతూ, ఉచిత సలహాలు ఇస్తూ తనను మేధావిగా చెప్పుకునే కెసిఆర్ ఇప్పుడు కరోనా మహమ్మారిని కట్టడి చేయడం చేతకాక చేతులెత్తేశారని, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని వివరించారు.

కరోనా వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే వాటిని అవహేళన చేశారు. తగిన వైద్య వసతులు లేవని మీడియాలో వార్తలు వస్తే వాటి యాజమాన్యానికి శాపనార్థాలు పెట్టారు. కరోనా పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని హైకోర్టు తప్పుబట్టినా సిఎం దొర ఏమాత్రం పట్టించుకోలేదు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి గవర్నర్ తమిళిసై స్వయంగా జోక్యం చేసుకుని సంక్షోభ నివారణకు చొరవ ప్రదర్శించారు. సిఎం కెసిఆర్ తన బాధ్యతల నిర్వహణలో విఫలం కావడంతో గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. గవర్నర్ చొరవను కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం సీఎం దొర నిరంకుశత్వానికి పరాకాష్ఠ అనే మాటలు వినిపిస్తున్నాయి.. అంటూ విజయశాంతి ట్విట్టర్ లో ధ్వజమెత్తారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/