విజయసాయిరెడ్డి పై రేవంత్ రెడ్డి సెటైర్లు

జగన్, విజయసాయిలపై 2011లోనే కేసులు నమోదయ్యాయి

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. ఓటుకు నోటు కేసు విచారణ న్యాయస్థానాల్లో నడుస్తోందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఏదైనా చెప్పేదుంటే కోర్టుకే చెపుతానని అన్నారు. ఏపీ సీఎం జగన్ వెనుకున్న విజయసాయిరెడ్డిలాంటోళ్లు నా కేసుల గురించి మాట్లాడుతుంటే తనకు నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. తనపై కేసులు 2016లో నమోదయ్యాయని… జగన్, విజయసాయిరెడ్డిలపై కేసులు 2011లోనే నమోదయ్యాయని రేవంత్ అన్నారు. విజయసాయిరెడ్డి పేరు ఏయే కేసుల్లో, ఎక్కడెక్కడ రాసుందో పాపం ఆయనకు తెలియనట్టుందని దెప్పిపొడిచారు. విజయసాయిలాంటి వారు అద్దంలో వారిని వారు చూసుకుని మాట్లాడితే బాగుంటుందని విమర్శించారు.

టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడినయ్యానని వైయస్ షర్మిల అన్నట్టు వార్తల్లో చూశానని రేవంత్ చెప్పారు. షర్మిల తండ్రి వైయస్ రాజశేఖరెడ్డిది ఏ పార్టీ? అని ప్రశ్నించారు. వైయస్ తొలుత రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారని… ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారని చెప్పారు. వైయస్ జగన్ తొలుత ఏ పార్టీ? అని ప్రశ్నించారు. వీళ్లందరూ పార్టీలు మారినవారే కదా అని ఎద్దేవా చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి ఎంపీగా గెలిచానని, పార్టీ కోసం తాను చేస్తున్న కృషిని చూసి అధిష్ఠానం తనకు పదవిని కట్టబెట్టిందని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/