వైసీపీ ప్లీనరీ వివరాలు తెలిపిన విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ప్లీనరీకి సిద్ధమవుతోంది. జులై 8,9వ తేదీల్లో గుంటూరు జిల్లా లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో ప్లీనరీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్లీనరీ నుంచి కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ప్రస్తుతం ప్లీనరీకి సంబదించిన పనులు జరుగుతున్నట్లు ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జులై 08 న ప్రతినిధులు వస్తారు .. అనేక తీర్మానాలు పెడుతున్నామని విజయసాయి రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం తదితర అంశాలపై మాట్లాడతారని.. నియోజకవర్గ, జిల్లా ప్లీనరీలో మంచి స్పందన కనిపించిందని, సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

ప్రజల స్పందన ఎలా ఉందో ప్లీనరీలో తెలుస్తుందని.. అందరికీ అన్నీ వసతులు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. తప్పకుండా ప్లీనరీ విజయవంతం అవుతుందని.. రెండు రోజులు పార్టీ అధ్యక్షుడు ప్లీనరీలో ఉంటారని చెప్పారు. ఆ రెండు రోజులు వానదేవుడు కరుణిస్తాడని ఆశిస్తున్నాం.ప్రభుత్వం వచ్చాకా మొదటి ప్లీనరీ ఇదన్నారు. మా పార్టీ విధానమే ప్రభుత్వ విధానమని.. ఇంకా మెరుగైన ఆలోచనలతో సీఎం ముందుకు వెళ్తారని పేర్కొన్నారు.

2017లో ఇదే ప్రాంతంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించిందని.., ఆ ప్లీనరీ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీ 151 స్థానాలతో అఖండ విజయం సాధించిందని విజయసాయి గుర్తుచేశారు. మళ్ళీ, అయిదేళ్ల తర్వాత 2022లో జులై 8,9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుంటున్నామన్నారు. మళ్లీ అయిదేళ్ల తర్వాత, అంటే 2027లో కూడా అధికారంలో ఉండే మా పార్టీ, అప్పుడు కూడా ప్లీనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.