మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన దగ్గరి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కూడా కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయకుండా ఆస్ట్రేలియా పర్యటన కు వెళ్లడం, తన తమ్ముడికి సహాకరించాలని కాంగ్రెస్ కార్య కర్తలను కోరడం, అంతే కాక మునుగోడు లో ఓడిపోయే కాంగ్రెస్ కు నా ప్రచారం అవసరమా అంటూ కామెంట్స్ చేయడం కాంగ్రెస్ అధిష్టానం సైతం సీరియస్ అయ్యింది. ఫోకాజ్ నోటీసు సైతం జారీ చేసారు.

దీంతో వెంకట్ రెడ్డి మీడియాలో కూడా ఎక్కడా కనిపించడం లేదు. మునుగోడు ఉపఎన్నికలో తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలవ్వడం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారంటూ ఏఐసీసీ తనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో వెంకటరెడ్డి కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు. తెలంగాణలో జరిగిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో కూడా పాల్గొనని ఆయన.. కాంగ్రెస్ కార్యక్రామల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది.

తాజాగా సీఎం కేసీఆర్ సర్కార్‌కు భువనగిరి నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఆయన లేఖ రాశారు. ఇసుక మాఫియా కారణంగా తన పార్లమెంట్ పరిధిలోని రోడ్లన్నీ దెబ్బతిన్నాయని ఆరోపించారు. వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయని, ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందంటూ విమర్శించారు. ఇసుక మాఫియా చేతుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, రోడ్లన్నీ నరకాన్ని తలపిస్తున్నాయంటూ వెంకటరెడ్డి ఆరోపించారు. తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి నేషనల్ హైవేలను మంజురు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రోడ్లను గాలికొదిలేసిందంటూ లేఖలో ఆరోపించారు. గతుకుల రోడ్ల వల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసిన రోడ్లను బాగు చేయించాలని లేఖలో పేర్కొన్నారు.