తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భాంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాంపల్లి అసెంబ్లీ చౌరస్తాలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 17 చరిత్రాత్మక రోజు అని , ఈరోజును వివాదాల్లేకుండా వేడుక జరుపుకోవాలని అన్నారు. కుల, మత బేధాల్లేకుండా జాతి సమైక్యత కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొన్నారు. వారంతా కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు.

ఇక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో 3 రాష్ట్రాలకు చెందిన కళానృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇక ఈ వేడుకలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హాజరయ్యారు. కాగా, పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు.