వెంక‌య్య నాయుడుని ఆక‌ర్షించిన ‘అంతిమ‌యాత్ర’ ప‌థ‌కం

vice president Venkaiah Naidu
vice president Venkaiah Naidu

కరీంనగర్‌: తెలంగాణలోని కరీంనగర్‌లో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఎంతగానో ఆకర్షించింది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారం కలగకుండా నగర పాలక సంస్థ ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు నిధులు కేటాయించడంతో పాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ పథకం వివరాలు తెలుసుకున్న వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్‌ కార్పొరేషన్‌, మేయర్‌ రవీందర్‌సింగ్‌కు అభినందనలు తెలిపారు.
కరీంనగర్‌లో రవీందర్‌సింగ్‌ మాట్లాడుతూ..నగరంలో ఎవరు చనిపోయినా రూపాయి చెల్లిస్తేచాలు వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు, దహనసంస్కారాలు చేపడతామని తెలిపారు. వచ్చే 15 లోగా పూర్తి కార్యాచరణతో అమలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అంతిమ యాత్ర..ఆఖరి సఫర్‌ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. దాతల కోసం ప్రత్యేకంగా నగర పాలక కమీషనర్‌ పేరు మీద ఖాతా ఏర్పాటు చేస్తామన్నారు. చనిపోయిన వారి కుటుంబానికి 50 మందికి సరిపడా భోజనం రూ.5లకే అందించే ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/