ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాసైన అవిభక్త కవలలు వీణ-వాణి

అవిభక్త కవలలు వీణ-వాణి ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. మంగళవారం విడుదలైన తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో వీణ-వాణీలు ఉత్తీర్ణత సాధించారు. వీణ 712 మార్కులు, వాణి 707 మార్కులతో ఫస్ట్‌ క్లాస్‌ సాధించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ వీణ, వాణిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వీణ-వాణిలు గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌ వెంగళ్​రావునగర్​లోని మహిళా, శిశు సంక్షేమ కార్యాలయంలో ఉంటున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వారిద్దరూ ఇంటర్ సెకండ్ ఇయర్​లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ వెల్లడించారు. ఇంటర్‌ సీఈసీ గ్రూపులో వీణ 712 మార్కులు, వాణి 707 మార్కులు సాధించినట్లు తెలిపారు. వారి భవిష్యత్‌కు అవసరమైన అన్ని సదుపాయాలతో పాటు, వారి కలలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు వీణ-వాణిలకు సహకారం అందించిన అధికారులకు అభినందనలు తెలిపారు.

వీణ వాణీలది మహబూబ్ బాద్ జిల్లా. 2003 సంవత్సరంలో మురళి, నాగలక్ష్మి దంపతులకు తలలు అతుక్కుని కవలలుగా పుట్టారు. చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువచ్చారు. అప్పటి నుంచి 12 ఏళ్ల వరకు నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్నారు. 12ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం కవలలను స్టేట్‌ హోమ్‌కు తరలించారు.వీణ వాణీలను విడదీయాలనే ఎంతగానే ప్రయత్నించినా వైద్యులు సఫలం కాలేదు.ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వీణ-వాణి కవలలకు ఇంటర్‌ బోర్డు ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఈ పరీక్షల్లో ప్రధమ శ్రేణిలో పాసై అందరికి ఆదర్శంగా నిలిచారు అవిభక్త కవలలు. ఇక ఇంటర్ పరీక్షా ఫలితాలను మంగళవారం ఉదయం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.16 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే టాప్ గా నిలిచారు.