ప్రయాణికులకు వినోదాన్ని పంచుతున్న టిఎస్ఆర్టీసీ

సరికొత్త ఆలోచనలతో ..ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తున్న టిఎస్ఆర్టీసీ ..ఇప్పుడు ప్రయాణికులకు వినోదాన్ని పంచుతుంది. ‘టీఎస్‌ఆర్టీసీ రేడియో’నుఏర్పటు చేయడం మొదలుపెట్టింది. ఫైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌ సిటీలోని 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే సూపర్ లగ్జరీ, గరుడ బస్సుల్లో టీవీ అందుబాటులో ఉండగా.. బస్సులో రేడియో సేవలు తీసుకొచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత పైలెట్ ప్రాజెక్టుగా ఈరోజు పలు బస్సుల్లో ఏర్పాటు చేసారు.

హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో కూకట్‌పల్లి డిపో బస్సులో ఈ రేడియోను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ శనివారం ప్రారంభించారు. అనంతరం రేడియో పనితీరును పరిశీలించారు. రేడియో ఏర్పాటు, అది పనిచేస్తున్న విధానం, సౌండ్‌, తదితర విషయాల గురించి టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ (ఆప‌రేష‌న్స్‌) పీవీ మునిశేఖర్‌, కూకట్‌పల్లి డిపో మేనేజర్‌ ఇషాక్‌ బిన్‌ మహ్మద్‌, మెకానికల్‌ సూపరింటెండెంట్‌ జయరాం, ఎలక్ట్రిషియన్‌ కేవీఎస్‌ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.

ఫైలట్‌ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టీఎస్‌ఆర్టీసీ రేడియో ప్ర‌యాణీకుల‌ను అల‌రించ‌నుంద‌ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఉప్పల్ – సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్ – సికింద్రాబాద్‌, గచ్చిబౌలి – మెహిదిపట్నం, సికింద్రాబాద్ – పటాన్‌చెరువు, కూకట్‌పల్లి – శంకర్‌పల్లి, కొండాపూర్ – సికింద్రాబాద్‌, కోఠి – పటాన్‌చెరువు, ఇబ్రహింపట్నం – జేబీఎస్‌ మార్గాల్లో న‌డిచే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా బస్సుల్లో శనివారం నుంచే రేడియో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.