శ్రీ వాసవీ కన్యకాదేవి పురాణం

Vaasavi maata

సాలంకాయన మహర్షి మణిగుప్తాదులతో ‘ఓ వైశ్యోత్తములారా! దుష్ట శిక్షణము, శిష్ట రక్షణము గావించు ఆదిపరాశక్తి యొక్క మహాద్భుత గాధలు పూర్వము మేధసుడను మహామునిచే సురధుడను రాజునకు, సమాధియను వైశ్యోత్తమునకు చెప్పబడినవి. ఆ వైశ్య వంశపాదోధి చంద్రుని కారణమున బహిర్గతములైన దేవీ మహాత్వ గాధలు వేదవ్యాస కృతమగు మార్కండేయ పురాణమున సవిస్తరమున వర్ణింపబడి ప్రసిద్ధములై లోకతారకములైనవి. ఆ సమాధి వలన వైశ్య వంశమే పునీతమైనది సుమా, అని పలికెను. దీన్ని బట్టి చూస్తే మేధసముని, సురధుడు, సమాధి వీరంతా వేదవ్యాస మహర్షి కంటే ముందు వారని తెలుస్తుంది. అంటే వైశ్య వంశాన్నే పునీతము చేసిన సమాధి దాదాపు ఆరువేల సంవత్సరాల క్రిందటివాడు. ఆయన్ను గూర్చి తెలుసుకోవటానికి మనలాగే మణిగుప్తాదులు కూడా కుతూహలపడ్డారు.

ఆయన దివ్య చరిత్రను చెప్పమని సాలంకాయన మహర్షిని అడిగారు. ఆయన చెప్పాడు. సురధుడను రాజు ఉండేవాడు. కోలా విధ్వంసులను రాజులు అతని శత్రువులు. వారు సురధుడిని యుద్ధంలో ఓడించారు. సురధుడు ఒక గుర్రాన్ని ఎక్కి అడవిలోకి పారిపోయాడు. అక్కడ విచారణ ముఖముతో ఉన్న సమాధిని చూశాడు. ఎవరు మీరు? ఎందుకు ఇలా ఖిన్నులై ఉన్నారు? అని ప్రశ్నించాడు. తనను గురించి తాను చెప్పుకొన్నాడు. సమాధి వినయముతో, ‘రాజా! నేను సంపన్న వంశమున జన్మించిన సమాధి అను వైశ్యుడను. నేను చేసే నిరంతర దాన ధర్మాలు నచ్చని నా పుత్రులు నన్ను వెడలగొట్టారు. అందుకే నేను ఈ అరణ్యానికి వచ్చాను.

కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నాను. నా పుత్రులు దుష్టస్వభావులే అయినా వారి యోగక్షేమాలు తెలుసుకోవాలిన నా మనసు ఆరాటపడుతున్నది. ఎందుకో మరి అని అన్నాడు. సురధుడు సమాధిని తన వెంట తీసుకుని మేధస ముని వద్దకు వెళ్లాడు. మునీశ్వరా! పోయిన రాజ్యాన్ని తిరిగి పొందాలన్న కోరిక నాకుంది, ఇంటి నుంచి తరిమేసిన కొడుకుల యోగక్షేమాలను గూర్చిన చింత ఈ సమాధికి ఉంది. వివేకవంతులమైన మాకు ఈ మూఢత్వమేల కలిగినది? అని ప్రశ్నించాడు. సృష్టి స్థితి లయ కారిణియగు ఆ మహా మాయా ప్రభావంచే ఈ సృష్టి అంతా మోహింప చేయబడుతున్నది అని చెప్పాడు మేధస ముని. ఆ పరేమశ్వరుని ధ్యానించమని వారిద్దరికీ సలహా ఇచ్చాడు.

సురధుడు, సమాధి ఒక నదీ తీరానికి వెళ్లి ఇసుక దిబ్బపై కూర్చొని శ్రేష్టమగు దేవీసూక్తమును జపిస్తూ తీవ్రమైన తపస్సు చేశారు. లోకరక్షకురాలు, లోకబాంధవి చండిక ప్రత్యక్షమై వరాలను కోరుకోమనింది. సురధుడు తాను కోల్పోయిన రాజ్యాన్ని పొందగోరాడు. సమాధి తనకును, తన బంధువర్గమగు నూట రెండు గోత్రముల వారికి కూడా మోక్షమును ప్రసాదించమని కోరాడు. అప్పుడా దేవి ‘కలియుగమున కుసుమ శ్రేష్టిగా నీవు జన్మిస్తావు. వాసవీ కన్యకగా నేను నీకు కుమార్తెనై జన్మించి, ఆత్మార్పణముగావించి, నీకును, నీ బంధువర్గమునకు మోక్షమెచ్చేట్లు చేస్తాను, అని మాట ఇచ్చింది. తనకే కాక తన బంధువర్గానికంతా మేలు కలగాలని కోరిన మహనీయుడు సమాధి. పరోపకార గుణానికి ప్రతీక.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/