రైతు సంఘాలు నిరసనలకు బీజేపీ ఎంపీ మద్దతు

మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జాతీయ కిసాన్ మోర్చా గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. సాగు చట్టాల వల్ల రైతులకు జరిగే లాభం ఏమీ లేదని, వాటివల్ల వ్యాపారుల వద్ద రైతు, బానిసగా మారతాడని, అందువల్ల వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ నిరసనలను తీవ్ర స్థాయిలో జరపాలని డిసైడ్ అయ్యారు.

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన మహా పంచాయత్ కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీన భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు. ఐతే ప్రస్తుతం రైతులు చేస్తున్న నిరసనపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మాట్లాడారు. కిసాన్ పంచాయితీలను సమర్థించిన వరుణ్ గాంధీ, రైతులతో సంప్రదింపులను కేంద్రం జరపాలని, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రైతుల బాధలను కేంద్రం అర్థం చేసుకోవాలనీ, రైతులు మన సొంత మనుషులనీ, గౌరవప్రదంగా వారితో సంప్రదింపులు జరపాల్సిన అవసరం చాలా ఉందని, సాగు చట్టాలపై వారు వినిపిస్తున్న గొంతును ఒక్కసారి కేంద్రం వినాలని వరుణ్ గాంధీ కోరారు.