టికెట్స్ ధరలఫై ఏపీ ప్రభుత్వానికి వర్మ సూటి ప్రశ్నలు

ఏపీలో సినిమా టికెట్స్ ధరల విషయంలో మరోసారి సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నోరువిప్పారు. ఇప్పటికే పలు మీడియా చానెల్స్ లలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా..మరోసారి తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ఈ వ్యవహారం ఫై స్పందించారు. టికెట్ ధరల తగ్గింపు విధానంపై సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని వర్మ అన్నారు. ఎవరో ఇద్దరు అగ్ర హీరోలపై కక్ష సాధింపుగా ప్రభుత్వం ఇలా చేస్తుందని తాను భావించడం లేదన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల సినీ పరిశ్రమతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశముందని వర్మ హెచ్చరించారు.

నేనెప్పుడూ ప్రభుత్వ పాలసీలు, రాజకీయాలను పెద్దగా పట్టించుకోను. నాకు వాటిపై అవగాహన లేదు. ఇప్పుడు నేను మాట్లాడే సబ్జెక్ట్‌పైనా స్పష్టత ఉందో లేదో చెప్పలేను. చలన చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా, కామన్‌మ్యాన్‌గా నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. నేనెవరినీ తప్పు బట్టడంలేదు. ఓ మ్యాన్యుఫ్యాక్చరర్‌ తాను తయారు చేసిన వస్తువును పలు రకాల ఫ్యాక్టర్స్‌ను బట్టి వెల నిర్ణయిస్తాడు. ఆ ధర వినియోగదారుడికి నచ్చితే వస్తువును కొనుక్కుంటాడు. ఇష్టం లేకపోతే మానేస్తాడు. ఒకవేళ ఆ వస్తువు అమ్ముడుపోతే సంబంధిత ట్యాక్స్‌ ప్రభుత్వానికి చేరుతుంది. చిన్న హోటల్‌ అయినా, ఫైవ్‌స్టార్‌ హోటల్ అయినా తినే ఆహారం ఒకటే. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు ఎంపిక చేసుకుంటారు. అది వారి వ్యక్తిగతం. థియేటర్ల విషయంలోనూ అంతే ” అన్నారు.

అలాగే హీరోల రెమ్యూనరేషన్ ఫై మంత్రులు చేసిన కామెంట్స్ ఫై కూడా వర్మ స్పందించారు. అనాదిగా హీరో ఇజం మెండుగా ఉన్న సినిమాలకే అలవాటు పడ్డ సగటు ప్రేక్షకులు, తమ అభిమాన హీరోలను చూడటానికి మాత్రమే సినిమాలకు వస్తారని అన్నారు. బ్రాండెడ్‌ చొక్కా రూ. 50 వేలల్లో, సాధారణ చొక్కా రూ. 50కే లభించవచ్చు. అలాంటప్పుడు ‘షర్ట్‌’ అని బోర్డు పెట్టి రెండింటికీ ఒకే రేటు చెబితే ఎలా? సినిమా టికెట్‌ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక ఏదైనా లాజిక్‌ ఉందా? ఉంటే అది చిత్ర పరిశ్రమకూ వివరించాలి. ధరను బట్టి టికెట్‌ కొనాలా, వద్దా? అని ప్రేక్షకుడు నిర్ణయించుకుంటాడు అని వర్మ అన్నారు.