నేడు రెండు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని

Vande Bharat Express: PM Modi to launch Mumbai-Solapur, Mumbai-Shirdi trains today

న్యూఢిల్లీః ప్రయాణికుల సౌకర్యార్థం దేశంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. టికెట్‌ ఖరీదు కాస్త ఎక్కువగా ఉన్నా.. గంటలకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు ప్రధాన నగరాలను కలుపుతూ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులోకి వస్తు్న్నాయి. ఇక తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ముంబయిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించనున్నారు. అలాగే రూ.38 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఒక రోజు రెండు వందే భారత్‌ రైళ్లను మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

కాగా, ఇప్పటి వరకు దేశంలో 8 వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి రాగా, 9వ వందే భారత్‌ రైలును ముంబై నుంచి సోలాపూర్‌ మధ్య ప్రారంభిస్తారు. దీని ద్వారా ముం-సోలాపూర్‌ మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. అలాగే 10వ వందే భారత్‌ రైలు ముంబై-సాయినగర్‌ షిరిడీ రూట్‌లో ప్రారంభం కానుంది. ముంబై-సోలాపూర్‌ మధ్య నడిచే రైలు సోలాపూర్‌లోని సిద్ధేశ్వర్‌ వచ్చే ప్రయాణికులు అక్కల్‌కోట్‌, తుల్జాపూర్‌, పండరిపూర్‌, అలండి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఇక ముంబ- షిరిడీ వెళ్లే ప్రయాణికులు నాసిక్‌, త్రయంబకేశ్వర్‌, సాయినగర్‌ షిరిడీ, శనిశిగ్నాపూర్‌ వెళ్లేవారికి ఈ సేవలు అందుకోవచ్చు. అయితే మహారాష్ట్రలో ఇప్పటికే రెండు వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి ఉండగా, తాజాగా మరో రెండు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

సమయ వేళలు:
ఈ వందే భారత్‌ రైలు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభం అవుతాయి. ముంబై-సోలాపూర్‌ రైలు 400 కిలోమీటర్ల దూరానికి కేవలం 6.35 గంటల్లో చేరుకోవచ్చు.

ఇక ముంబై- షిరిడీ మధ్య 340 కిలోమీటర్లు. ఈ దూరాన్ని చేరుకోవాలంటే 5.24 గంటల సమయం పడుతుంది. అయితే త్వరలో మరిన్ని రూట్లలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్‌- తిరుపతి, సికింద్రాబాద్‌-బెంగళూరు, సికింద్రాబాద్‌-పూణె రూట్లలో వందే భారత్‌ రైళ్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.