గల్లంతైన ఆ 136 మందీ చనిపోయినట్లే..ప్రభుత్వం ప్రకటన
చమోలీ విపత్తులో ఇప్పటి వరకు 68 మంది మృతి…ఇంకా జాడ తెలియని 136 మంది
Uttarakhand flash floods: 136 missing persons to be declared dead for early compensation
దేహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని చమోలీలో ఈ నెల 7న సంభవించిన జల ప్రళయంలో ఇప్పటి వరకు 68 మంది చనిపోయినట్టు గుర్తించగా, ఇంకా జాడతెలియని ఆ 136 మందిని ‘చనిపోయినట్టుగానే భావిస్తున్నట్టు’ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి అమిత్ సింగ్ తెలిపారు. సాధారణంగా ఏదైనా ఘటనలో ఎవరైనా అదృశ్యమై, ఏడేళ్ల వరకు వారి జాడ తెలియకపోతే అప్పుడు వారు మరణించినట్టు ధ్రువీకరిస్తారు. అయితే, ఉత్తరాఖండ్ విపత్తుకు ఇది వర్తించదని అమిత్ సింగ్ పేర్కొన్నారు. కాబట్టి మరణించినట్టు భావిస్తున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం పంపిణీ, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
ఇందుకోసం గల్లంతైన వారిని మూడు కేటగిరీలుగా విభజించినట్టు చెప్పారు. దుర్ఘటన జరిగిన ప్రాంతం సమీపంలో గల్లంతైన ప్రజలను మొదటి కేటగిరీలో చేర్చగా, విపత్తు సంభవించిన ప్రాంతం వద్ద ఉండి గల్లంతైన ఇతర జిల్లాలకు చెందిన వారిని రెండో కేటగిరీలో చేర్చారు. మూడో విభాగంలో పర్యాటకులను చేర్చారు. వీరికి సంబంధించిన వివరాలను ప్రకటనల రూపంలో ఇస్తారు. నెల రోజుల తర్వాత కూడా ఎలాంటి అభ్యంతరాలు రాకుంటే అప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. అనంతరం నష్టపరిహారం పంపిణీ చేస్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/