యూపీ సీఎం యోగికి బిగ్ షాక్ : కేబినెట్‌ మంత్రి దినేష్ ఖతిక్ రాజీనామా

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ నేత, మంత్రి దినేష్ ఖతిక్ తన కేబినెట్‌ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పంపారు. దళితుడైన తనను పక్కకుబెట్టడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు ఖతిక్ ప్రకటించారు. ఖతిక్‌ యూపీ నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల సీఎం తనను అవమానిస్తున్నారని, గత 100 రోజుల నుంచి తనకు పనులు అప్పజెప్పడం లేదని దినేష్‌ ఖతిక్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాక తన శాఖపరమైన బదిలీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎంతో బాధను అనుభవించే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

‘‘నేను దళితుడిని కాబట్టే నాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. నేను రాష్ట్రమంత్రిగా పనిచేయడం ద్వారా దళితవర్గానికి ఎలాంటి ఉపయోగం లేదు. నన్ను ఏ సమావేశానికి పిలవడం లేదు. ఈ పరిణామాలు నన్ను బాధించాయి. అందుకే రాజీనామా చేస్తున్నాను’’ అని ఖతిక్ ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వాల్లో అసంతృప్తి బయటపడడం చాలా అరుదు..అయితే ఏకంగా ఓ మంత్రే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈయన మాత్రమే కాదు మరో మంత్రి జితిన్ ప్రసాద కూడా రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతేడాది యూపీ ఎన్నికలకు నెలరోజుల ముందే ప్రసాద కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారారు.