మంత్రిగా కెటిఆర్ విఫలమయ్యారు
పుర ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి

నల్లగొండ: పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆయన పురపాలక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపిఏ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.12వేల కోట్ల నిధులు మంజూరు చేశామని ఆయన అన్నారు. రాష్ట్రంలో అధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి సిఎం కెసిఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు. ఒక్కరికి కూడా మంత్రి మండలిలో అవకాశం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. గిరిజనులు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగి లేదని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో, ట్రిపుల్ తలాక్, జిఎస్టి విషయంలో బిజెపి ప్రభుత్వానికి కెసిఆర్ మద్దతిచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. టిఆర్ఎస్కు ఓటేస్తే అది బిజెపికి వేసినట్లే అని ఆయన అన్నారు. అందరికీ న్యాయం జరిగే పాల కావలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఉత్తమ్ కుమార్రెడ్డి కోరారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/