ఎల్లుండి రాజగోపాల్ తో ఉత్తమ్ భేటీ

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీని విడి బిజెపి లో చేరబోతున్నారనే వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజగోపాల్ ను దూరం చేసుకోవడం ఇష్టంలేని కాంగ్రెస్ పార్టీ ఆయనతో బుజ్జగింపులు చేస్తుంది. ఇప్పటికే పలువురు ఆయనతో మాట్లాడగా..తాజాగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం రాజగోపాల్ తో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సమావేశమైన నేతలు.. పార్టీ మారకుండా ఆయన్ను ఒప్పించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన బాధ్యతను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. పార్టీ వీడకుండా ఆయన్ను ఒప్పించేందుకు ఉత్తమ్ ప్రయత్నం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అటు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.

ఇదిలా ఉంటె..రాజగోపాల్ బిజెపి లో చేరినప్పటికీ ఆయన వెంట మాత్రం కార్యకర్తలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మూడు రోజులుగా నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో రాజగోపాల్​ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. నియోజకవర్గ ప్రజలు మాత్రం వ్యక్తిగతంగా మీరంటే ప్రాణం ఇస్తాం.. కానీ మీ వెంట రాలేం అంటూ తేల్చి చెపుతుండడం తో రాజగోపాల్ కు ఏంచేయాలో అర్ధం కావడం లేదు. మరోపక్క రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు నేతలు ఆరాటపడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి చేరికపై బీజేపీలో చర్చ జరుగుతోంది. ఆయనను రేపు (శుక్రవారం) ఢిల్లీ తీసుకెళ్లాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అయితే రాజగోపాల్ మాత్రం పార్టీలో చేరేందుకు మరో వారం సమయం ఇవ్వాలని కోరినట్లు సమాచారం.