వైమానిక భద్రత తొలి మహిళా డైరెక్టర్ జనరల్
ఉషా పథి, ఐఎఎస్.

గాలిలో ప్రయాణం! పక్షితో కూడా జాగ్రత్తగా ఉండాలి. దుష్ట నేత్రాలు ఉంటాయి. హైజాకర్‌లు.. బాంబర్‌లు..ఇంకా.. ఊహించని ఉపద్రవాలు. వాటి నుంచి భద్రతకే బి.సి.ఎ.ఎస్. ఆ బిసిఎఎస్‌కు కొత్త బాస్..ఉషా పథి, ఐఎఎస్. తొలి మహిళా డైరెక్టర్ జనరల్.
ఒడిశా క్యాడర్ ఐఎఎస్ అధికారి ఉషా పథి. 1995 బ్యాచ్, కర్ణాటక అమ్మాయి. బి.టెక్. సివిల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ డివిజన్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఢిల్లీలో ఉద్యోగం.
1969లో జన్మించారు ఉష. సర్సీసు లెక్కలు, వయసు లెక్కలు కాదు. గత రెండున్నర దశాబ్దాలలో దేశమంతటా వివిధ హోదాల్లో ఆమె చేపట్టిన బాధ్యతల జాబితా ఓ గవర్నమెంట్ ఫైల్ అంత ఉంటుంది. అయితే అందులో ఒక అవార్డు పత్రం కూడా ఉండదు.
ఆమె పనితీరే ఆమెకు గుర్తింపు. ఫొటోలలో ఆమె అబ్దుల్ కలామ్‌తో, ప్రణబ్‌ముఖర్జీతో కనిపించవచ్చు. విధుల నిర్వహణలో భాగంగా మాత్రమే తన ప్రమేయం లేకుండా వాళ్లతో కలిసి ఉన్నప్పడి ఫొటోలే అవన్నీ, సర్వీసులో ఉండగానే ఎంబిఎ ఫారిన్ డిగ్రీ చేశారు.
న్యూఢిల్లీ, బెంగళూరు, ముస్సోరి, కోయంబత్తురు, పంచాగ్ని (మహారాష్ట్ర)లో పాలనాపరమైన శిక్షణ పొందారు.
అంటే క్షణం కూడా ఎక్కడా ఆగలేదని! ఐఎఎస్ ఆఫీసర్‌ల మిడ్ కెరీర్ ప్రోగ్రామ్‌లో కూడా శిక్షణ తీసుకున్నారు. ఉషకి కొత్తగా ఎక్కడికి పోస్టింగ్ వచ్చినా..
ఆమె కన్నాముందుగా ఆమె కెరీర్ వెళ్లి ఆ సీట్లో కూర్చుంటుంది! లైఫ్ సైజ్‌ను కూడా దాటిపోయిన కెరీర్ ఆమెది. ఢిల్లీలోని ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ( బిసిఎఎస్) డైరెక్టర్ జనరల్ ఆమె ఇప్పుడు.
ఆ పదవిని చేపట్టిన తొలి మహిళ! నలభై రెండేళ్ల నుంచీ ఉంది బిసిఎఎస్, ‘డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్‌లో ఒక విభాగంగా 1979 లో బిసిఎఎస్ ఏర్పాటైంది.
అంతకు రెండేల్ల క్రితం ఇండియన్ ఎయిర్ లైన్ విమానం హైజాక్ అయిన అనుభవంతో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బిసిఎఎస్ స్వతంత్ర విభాగం అయింది.
ఆ విభాగానికే ఉష ఇప్పుడు డైరెక్టర్ జనరల్ భారతదేశ విమానాల, విమాన ప్రయాణికుల భద్రత బాధ్యత ఉషదే! ఆమే కేర్ తీసుకోవాలి. గగనతలానికి కనురెప్ప ఉషా పథీ.
ఈ పోస్టులకి రాకముందు ఆమె పౌర విమానయాన మంత్రి త్వశాఖలో జాయింట్ సెక్రటరీ, కొత్త కుర్చీలోకి వచ్చి కూర్చోగానే.. ‘ఎట్‌లాస్ట్ ఎ శ్రీమతి.. ఈ పొజిషన్‌లోకి అని ఉష ట్వీట్ చేశారు.
తొలి మహిళే కాదు, బిసిఎఎస్ డైరెక్టర్ జనరల్ అయిన మూడో ఐఎఎస్ ఆఫీసర్‌గా కూడా ఆమెకు ఇదొక గుర్తింపు.
సాధారణంగా ఈ విభాగానికి చీఫ్‌లుగా ఐపిఎస్ ఆఫీసర్‌లు ఉంటారు. ఇరవై నాలుగేళ్ల కెరీర్‌లో నలభై ఎనిమిదేళ్ల సర్వీసు అనిపిస్తుంది ఉష గురించి వింటే తొంభై ఆరులో సివిల్స్ పాస్ అయితే..
తొంబై ఎనిమిది వరకు ట్రైనింగ్, తర్వాత నుంచి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ఛాలెంజింగ్, సబ్ కలెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, కలెక్టర్, కలెక్టర్ అండ్ డిఎం. అలా 2004 వరకు వివిధ జిల్లాలు,ప్రాతాలు!
2005 నుంచి డైరెక్టర్. సాంఘిక సంక్షేమం, పంచాయితీరాజ్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, స్కూల్ అండ్ మాస్ ఎడ్యుకేషన్, టెక్స్‌టైల్ అండ్ హ్యాండ్లూమ్ శాఖలు.
2015 వరకు, ఆ తర్వాతి నుంచీ సివిల్ ఏవియేషన్. ఒక ఐఎఎస్. ఆఫీసర్‌కు ఇదంతా మామూలే అనిపించవచ్చు.
అయితే ఉష చేపట్టిన బాధ్యతలేవీ మామూలు శాఖలు కాదని ఈ లిస్ట్ చూస్తే అర్థమౌతుంది. సంక్షేమం, విద్య.. ఉద్యోగం.. కీలకమైనవి. వాటిని ఉష సమర్థంగా నడిపించారు. ఉద్యోగంలోనే ఒక భాగం అయిన మరొక ప్రపంచం ఆమెకు..
భర్త అరవింద్, కొడుకు తేజ్. ఉషా పథీ భర్త అరవింద్ కూడా ఐఎస్‌ఎస్ ఆఫీసర్, ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. ముస్సోరీ ఐఎఎస్ శిక్షణలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు. సివిల్స్ రాయకముందు ఉష లవ్ ఇంట్రెస్ట్ మాత్రం మెడిసిన్.
తన తల్లిలా తనూ డాక్టర్ అవాలని అనుకున్నారు కానీ మెడిసిన్‌లోసీటు రాలేదు. ఇంజినీరింగ్ చదివి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ని ఎంచుకున్నారు. మంచిదైంది. అందించవలసిన సేవలు, చక్కబెట్టాల్సిన అనారోగ్య పరిస్థితులు వైద్య రంగంలో మాత్రమే ఉండవు కదా.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/