ఉక్రెయిన్ సైనికులకు శిక్షణ ఇవ్వనున్న అమెరికా

ఉక్రెయిన్ కు 80 కోట్ల డాలర్ల విలువైన సైనిక వాహనాలు, ఆయుధాలు సరఫరా చేయాలని నిర్ణయం

వాషింగ్టన్ : ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒక వైపు వెనక్కి తగ్గుతున్నట్టే కనిపిస్తున్న రష్యా… మళ్లీ విరుచుకుపడుతోంది. మరోవైపు, యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయన్ కు ఆర్థికంగా, సైనికపరంగా అమెరికా ఎంతో సాయం చేస్తోంది. తాజాగా మరింత క్రియాశీలకంగా మారేందుకు సిద్ధమవుతోంది. పెద్ద మొత్తంలో ఆయుధాలను, మందుగుండు సామగ్రిని ఉక్రెయిన్ కు పంపాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా 80 కోట్ల డాలర్ల విలువైన 18 హోవిట్జర్లు (155 ఎంఎం), 40 వేల ఆర్టిలరీ రౌండ్లు, మానవరహిత తీర రక్షక నౌకలు, 500 జావెలిన్ క్షిపణులు, వందల సంఖ్యలో వాహనాలు, 300 స్విచ్ బ్లేడ్లు, 10 ఏఎన్/టీపీక్యూ – 36 ఫిరంగి నిరోధక రాడార్లు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి, 11 ఎంఐ-17 హెలికాప్టర్లను పంపబోతోంది.

అంతేకాదు, ఈ అత్యాధునిక వ్యవస్థలను ఉపయోగించే విషయంలో ఉక్రెయిన్ సైనికులకు శిక్షణను ఇవ్వబోతోంది. ఎంపిక చేసిన ఉక్రెయిన్ సైనికులను తీసుకొచ్చి అత్యంత వేగంగా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం వీరు ఉక్రెయిన్ కు వెళ్లి, సహచర సైనికులకు శిక్షణ ఇస్తారు. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో దాడులను ముమ్మరం చేయాలని రష్యా నిర్ణయించినట్టు వార్తలు వస్తున్న తరుణంలో అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు అమెరికా నిర్ణయం రష్యాకు మరింత ఆగ్రహాన్ని కలిగించే అవకాశం ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/