ఈ దేశాలపై అమెరికా మరిన్ని ఆంక్షలు
వలసదారులకు వీసాలు ఇచ్చేది లేదన్న ట్రంప్ సర్కార్

వాషింగ్టన్: భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ, పలు దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధాజ్ఞలు జారీ చేశారు. వీసా అనుమతులపై ఆంక్షలు విధించే దస్త్రాలపై సంతకం చేశారు. ఇప్పటికే నిషేధం ఉన్న ఇరాన్, లిబియా, సిరియా, యెమన్, సోమాలియా, వెనిజులా, ఉత్తర కొరియా పౌరుల ప్రవేశంపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వీటికి అదనంగా మయన్మార్, ఎరిట్రియా, కిర్గిజిస్తాన్, నైజీరియా వలసదారులకు వీసాలు ఇవ్వరాదని నిర్ణయించింది. సూడాన్, టాంజానియా దేశాల పౌరులు వీసా లాటరీలో పాల్గొనే అవకాశాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వైట్ హౌస్ సమాచార శాఖ కార్యదర్శి స్టెఫానియా గ్రెషమ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఆంక్షలు టూరిస్టులు, వ్యాపారులు, వలసేతర ప్రయాణికులకు వర్తించబోవని స్పష్టం చేశారు. అంతర్జాతీయ భద్రతా నిబంధనలను పాటించకుంటే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యాక్టింగ్ సెక్రటరీ చాడ్ ఎఫ్ వోల్ఫ్ తెలిపారు.
తాజా బడ్జెట్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/budget/