ప్ర‌పంచ దేశాల‌ కోసం అమెరికా కీలక నిర్ణయం!

50 కోట్ల ఫైజ‌ర్ వ్యాక్సిన్లు కొని ప్ర‌పంచ దేశాల‌కు ఇవ్వ‌నున్న అమెరికా

వాషింగ్టన్: కరోనా మహమ్మారి నుంచి ప్ర‌పంచ దేశాలను రక్షించేందుకు తాజాగా అమెరికాలోని జో బైడెన్ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 కోట్ల ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ క‌రోనా వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేయ‌నున్న‌ట్లు బుధ‌వారం వెల్ల‌డించింది. వచ్చే ఏడాది కాలంలోనే 50 కోట్ల టీకా డోసులు ప్రపంచంలోని 92 పేద దేశాలతోపాటు ఆఫ్రికా దేశాలకు స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని పేర్కొంది. జీ7 దేశాల సదస్సుకు ముందు గురువారం ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేయనున్నార‌ని వైట్‌హౌస్ వ‌ర్గాలు తెలిపాయి.

2021లో 10 కోట్ల మంది కోసం 20 కోట్ల డోసులు సరఫరా చేయనుండగా.. వచ్చే ఏడాదిలో మిగిలిన 30 కోట్ల డోసులు అందించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ సంద‌ర్భంగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్​ సులివాన్ మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయటంలో ప్రజాస్వామ్య దేశాలే ముందుంటాయని అన్నారు. మ‌హ‌మ్మారిని తుద‌ముట్టించే ఆయుధసామాగ్రి (టీకా​లు) అగ్ర‌రాజ్యం వద్దే ఉందని ఆయ‌న పేర్కొన్నారు. ఇక క‌రోనాతో పోరులో భాగంగా ప్ర‌పంచ‌దేశాల‌కు వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాలో అమెరికా వెనుకాడుగు వేయ‌బోద‌ని సులివాన్ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/