అమెరికా అణు జ‌లాంతర్గామికి ప్ర‌మాదం

వాషింగ్ట‌న్‌: అమెరికాకు చెందిన అణ్వాయుధ సామ‌ర్థ్యం క‌లిగిన జలాంత‌ర్గామికి .. ద‌క్షిణ చైనా స‌ముద్ర జ‌లాల్లో ప్ర‌మాదం జ‌రిగింది. గుర్తుతెలియ‌ని ఏదో ఒక వ‌స్తువు ఆ స‌బ్‌మెరైన్‌ను ఢీకొట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో డ‌జ‌న్ల సంఖ్య‌లో అమెరికా నేవీ సైనికులు గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. ద‌క్షిణ చైనా స‌ముద్ర ప్రాంతం ఇటీవ‌ల వివాదాస్ప‌దంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో ప‌హారాకాస్తున్న అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ క‌న‌క్టిక‌ట్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. అక్టోబ‌ర్ రెండ‌వ తేదీన జ‌రిగిన ప్ర‌మాదంలో 15 మంది నావికుల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

అయితే స‌బ్‌మెరైన్‌ను ఢీకొన్న‌ది ఏంట‌న్న విష‌యం ఇంకా స్ప‌ష్టం కాలేదు. ఇటీవ‌ల తైవాన్ వాయు ర‌క్ష‌ణ వ‌ల‌యంలోకి చైనా విమానాలు దూసుకెళ్లిన విష‌యం తెలిసిందే. దెబ్బ‌తిన్న అమెరికా యుద్ధ జ‌లాంత‌ర్గామి ప్ర‌స్తుతం గువామ్ దిశ‌గా వెళ్తున్న‌ట్లు నేవీ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. క‌న‌క్టిక‌ట్‌లో జ‌లాంత‌ర్గామిలో ఉన్న న్యూక్లియ‌ర్ ప్రొప‌ల్ష‌న్ ప్లాంట్ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు నేవీ ప్ర‌తినిధి తెలిపారు. స‌బ్‌మెరైన్‌కు ఎంత న‌ష్టం జ‌రిగిందో కూడా అంచ‌నా వేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/