నిఘా బెలూన్‌ కూల్చివేత.. అమెరికాపై చైనా ఆగ్రహం

తమ బెలూన్​ను పేల్చి దౌత్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశారంటూ చైనా ఆగ్రహం

us-shooting-down-balloon-seriously-damaged-relations-says-china

బీజింగ్‌ః తమ భూభాగంలోకి వచ్చిన చైనా బెలూన్ (ఎయిర్ షిప్) అమెరికా కూల్చివేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ సైనిక స్థావరాలపై నిఘా పెట్టేందుకు డ్రాగన్ దేశం పంపినట్టుగా అనుమానించిన సదరు ఎయిర్ షిప్ సముద్రంలో కూలిపోయేలా అమెరికా దళాలు పేల్చివేశాయి. ఇందుకోసం ఫైటర్ జెట్ ఎఫ్-22 రాప్టర్ ఒక క్షిపణిని ప్రయోగించింది. ప్రస్తుతం సముద్రంలో పడిపోయిన బెలూన్ శకలాలను సేకరించేందుకు యూఎస్ఏ నావికాదళం ప్రయత్నిస్తోంది. అమెరికాలోని మూడు అణు క్షిపణి ప్రయోగ కేంద్రాలలో ఒకటైన మోంటానాపై మూడు బస్సుల పరిమాణంలో అనుమానిత నిఘా బెలూన్ శుక్రవారం కనిపించడంతో కలకలం రేగింది.

ఒకవేళ అక్కడే ఈ బెలూన్ ను కూల్చివేసి ఉంటే దాని శకలాలు పడి మోంటానాలో దాదాపు రెండు వేల మంది ప్రజలకు ప్రమాదం వాటిల్లేదని అధికారులు చెప్పారు. దాంతో, బెలూన్‌ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళుతున్నప్పుడు దాన్ని పేల్చివేశారు. తమ సైనిక స్థావరాల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ స్పై బెలూన్‍ను చైనా పంపిందని అమెరికా అనుమానించింది. కాగా, వాతావరణంపై అధ్యయనం చేసేందుకే బెలూన్ ను పంపించామని చైనా అంటోంది. దాన్ని అమెరికా కూల్చివేయడం పట్ల చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే అమెరికా బెలూన్‌ను కూల్చివేయడం అగ్రరాజ్యంతో సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసి దెబ్బతీసిందని చైనా పేర్కొంది. తమ నుంచి కూడా సరైన ప్రతిస్పందన ఉంటుందని పేర్కొంది.