భారత్‌కు అండగా అమెరికన్‌ బలగాలు

క్షేత్ర స్థాయిలో రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటాం..మంత్రి మైక్ పాంపియో

Mike Pompeo
Mike Pompeo

వాషింగ్టన్‌: భారత్‌ సహా పలు ఆసియా దేశాలకు చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాన్ని సమీక్షిస్తున్నామని అమెరికా ప్రకటన చేసింది. ఈనేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. చైనా సైన్యంతో ఇండియాకు ప్రమాదం పొంచివుందని వ్యాఖ్యానించిన ఆయన, ఇండియాతో పాటు మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర ఆసియా దేశాలకు ముప్పు ఉందని అన్నారు. గురువారం నాడు జర్మన్ మార్షల్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన వర్చ్యువల్ బ్రసెల్స్ ఫోరమ్ 2020లో పాల్గొన్న ఆయన, ఈ వ్యాఖ్యలు చేశారు.

‘చైనా సైన్యాన్ని నిలువరించేందుకు పలు దేశాలలో ఆర్మీని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నాం. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయా దేశాలకు మద్దతిచ్చేలా ఆలోచిస్తున్నాం. ఈ విషయమై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు సమీక్షలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే జర్మనీలోని మా సైన్యాన్ని 52 వేల నుంచి 25 వేలకు తగ్గించాం’ అని మైక్ పాంపియో వెల్లడించారు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షించిన తరువాతనే తీసుకుంటామని ఆయన అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/