గర్భస్రావ హక్కును కాపాడే ఉత్తర్వులపై బైడెన్‌ సంతకం

గర్భస్రావ హక్కును రెండు వారాల క్రితం రద్దు చేసిన అమెరికన్ సుప్రీంకోర్టు

US President Joe Biden announces new measures to protect women’s abortion rights

వాషింగ్టన్‌ః గర్భస్రావంపై (అబార్షన్‌) మహిళా హక్కులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అబార్షన్‌కు రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గర్భస్రావ హక్కును రెండు వారాల క్రితం అమెరికన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

ఈ నేపథ్యంలో ఆ హక్కును పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలంటూ సొంతపార్టీ అయిన డెమొక్రటిక్ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుండడంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ ఉత్తర్వుల ద్వారా పరిమిత ప్రయోజనం మాత్రమే ఉంటుందని బైడెన్ పేర్కొన్నారు. అబార్షన్‌పై ఇప్పటికే 12 రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే యోచన చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వుల వల్ల పరిమిత ప్రయోజనం మాత్రమే ఉండే అవకాశం ఉంది. గర్భస్రావాన్ని సమ్మతించే రాష్ట్రాలకు వెళ్లి, అక్కడి సేవలను వినియోగించుకోవడంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాజా ఉత్తర్వులు రక్షణ కల్పిస్తాయి. అలాగే, గర్భస్రావ హక్కును కాపాడడంలో కోర్టులో పోరాటం మొదలుపెట్టాలని న్యాయ, ఆరోగ్య-మానవ సేవల శాఖను బైడెన్ ఆదేశించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/