కరోనాపై పోరుకు అమెరికా భారీ ఆర్థిక సాయం

పోరాడేందుకూ సిద్ధంగా ఉన్నామన్న అగ్రరాజ్యం

Coronavirus
Coronavirus

వాషింగ్టన్: కొన్ని రోజుల క్రితం చైనాతో అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం నడిచింది. కరోనా వైరస్ చైనాను గడగడలాడించడంతో అమెరికా ఓ మెట్టుదిగి వచ్చింది. చైనాలో కరోనావైరస్‌ బాధితులను ఆదుకునేందుకు ఆ మహమ్మారిపై పోరు చేసేందుకు అగ్రరాజ్యం డ్రాగన్ కంట్రీకి 100 మిలియన్ అమెరికన్ డాలర్లు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు ఇతర దేశాల్లో కరోనా వైరస్ బారినపడి ఇంకా ఆయా దేశాలను గడగడలాడిస్తున్న వైరస్‌పై పోరుకు అమెరికా తనవంతు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపే చెప్పారు. ఇక అమెరికా ప్రభుత్వంతో పాటు తమ దేశంలోని పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ మహమ్మారిని పారద్రోలేందుకు తమవంతుగా పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమని పాంపే చెప్పారు. మరోవైపు కరోనా వైరస్‌ను ఎదుర్కొని దేశం నుంచి పారద్రోలేందుకు చైనా ప్రభుత్వం అన్ని రకాల మార్గాలను వెతుకుతోంది. కష్ట సమయంలో ఆదేశ సహకారాన్ని కోరింది. అందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించడంతో.. అగ్రరాజ్యం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చైనా తెలిపింది. ఇప్పటికే కరోనావైరస్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా జరుగుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/