కొత్త పన్నులను విధించే యోచనలో అమెరికా

అమలులోకి వచ్చిన ఈక్వలైజేషన్ టాక్స్

India , America
India , America

అమెరికా: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్రేడ్ డెఫిసిట్, జీఎస్పీ పన్ను మినహాయింపులను ఎత్తివేత, హెచ్1బీ సహా పలు రకాల వీసాలపై ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా రెండు దేశాల మధ్య కొత్త వివాదం ‘గూగుల్ టాక్స్’ రూపంలో పెరుగుతోంది. ఇది ముదిరితే ఇండియాలో తయారయ్యే వస్తువులపై అమెరికాలో పన్నుల భారం గణనీయంగా పెరుగుతుంది. నిజానికి ఈ చట్టాన్ని 201617లో ఈక్వలైజేషన్ టాక్స్ పేరిట ప్రవేశపెట్టగా, అది ఈ సంవత్సరం జూన్ నుంచి అమలులోకి వచ్చింది. దేశం బయట శాశ్వత కార్యాలయాలను నిర్వహిస్తూ, వాణిజ్య ప్రకటనల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న ఫేస్ బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి దిగ్గజ డిజిటల్ కంపెనీలన్నీ ఈ చట్టం పరిధిలోకి వచ్చాయి.

దీంతో ఈ చట్టానికి ‘గూగుల్ టాక్స్’ అన్న పేరు వచ్చింది. ఈ కంపెనీలకు ఇండియా నుంచి అత్యధిక ఆదాయం లభిస్తుందన్న సంగతి తెలిసిందే. భారీ ఎత్తున ఆదాయం పొందుతూ కూడా ఈ డిజిటల్ కంపెనీలు చెల్లించాల్సిన స్థాయిలో పన్నులను చెల్లించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఇండియా టాక్స్ సిస్టమ్ లో డిజిటల్ వరల్డ్ కు సంబంధించిన సరైన చట్టాలు లేకపోవడంతో అమెరికా కేంద్రంగా నడుస్తున్న కంపెనీలకు అది వరంగా మారింది. ఇక్కడి వాణిజ్య ప్రకటనల డబ్బంతా విదేశాల్లోని సంస్థ ప్రధాన కార్యాలయాలకు చేరుతున్నాయి.

ఈ కంపెనీలు తమ అనుబంధ భారత విభాగాల చివర ‘ఇండియా లిమిటెడ్’ అని పేరుకు మాత్రమే తగిలించుకుంటున్నాయి. ఈ కంపెనీల నుంచి పన్నులు వసూలు కావడం లేదని గ్రహించిన భారత ప్రభుత్వం ఈ నూతన పన్ను మార్పులను తీసుకుని వచ్చింది. ఇండియాలోని చట్టాల్లోని లొసుగులను అడ్డు పెట్టుకుని డబ్బు దోచుకుంటున్న డిజిటల్ సంస్థలకు అడ్డుకట్ట వేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ కొత్త పన్నుపై ఆగ్రహంతో ఉన్న గూగుల్, ఫేస్ బుక్ వంటి యూఎస్ కంపెనీలు, అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించగా, ట్రంప్ స్వయంగా కల్పించుకున్నారు. ఇండియా సహా 9 దేశాల్లో డిజిటల్ సంస్థలపై విధిస్తున్న పన్నులను ఆయన పరిశీలిస్తున్నారు. దర్యాఫ్తు సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకుని, ఈ పన్నులతో నష్టమెంతన్న విషయాన్ని నిపుణులతో సమీక్షిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/