పాకిస్థాన్ ను అమెరికా బానిస చేసేసింది : ఇమ్రాన్ ఖాన్

విదేశీ ప్రభావిత ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరించరని వ్యాఖ్యలు

లాహోర్ : అగ్రరాజ్యం అమెరికాపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. తనను గద్దె దించడం వెనుక అమెరికానే కీలక పాత్ర పోషించిందని ఇమ్రాన్ ఖాన్ బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో, అమెరికాపై విమర్శనాస్త్రాలు సంధించారు. దండయాత్ర చేయకుండానే పాకిస్థాన్ ను అమెరికా ఓ బానిసగా మార్చేసిందని వ్యాఖ్యానించారు. విదేశీ ప్రభావిత ప్రభుత్వాన్ని పాకిస్థాన్ ప్రజలు ఎన్నటికీ అంగీకరించబోరని స్పష్టం చేశారు. ఫైసలాబాద్ లో ఓ సభలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఇమ్రాన్ ఖాన్ అత్యంత అవమానకర పరిస్థితుల్లో ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆపై షాబాజ్ షరీఫ్ పాక్ ప్రధానమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు. అయితే, తన ప్రత్యర్థులకు అమెరికా సహాయ సహకారాలు అందించి, తనను పదవీచ్యుతుడ్ని చేసిందని ఇప్పటికే ఇమ్రాన్ పలు వేదికలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఆరోపణలను అమెరికా తోసిపుచ్చింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/