బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ను బహిష్కరించిన అమెరికా

వాషింగ్టన్‌ : వచ్చే ఏడాదిలో చైనాలోని బీజింగ్‌లో జరిగే వింటర్‌ ఒలిపింక్స్‌ క్రీడలను దౌత్యపరంగా బహిష్కరించింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకీ ప్రకటించారు. బీజింగ్‌లో జరిగే వింటర్‌ ఒలిపింక్స్‌, పారాలింపిక్‌ క్రీడలకు బైడెన్‌ పరిపాలన అధికారిక, దౌత్య ప్రతినిధులను ఎవరినీ పంపదని ప్రకటించారు. జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో, చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలే కారణమని స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరిలో చైనాలో వింటర్‌ ఒలింపిక్స్‌ జరుగాల్సి ఉన్నాయి.

అయితే, క్రీడల్లో అమెరికా ఆటగాళ్లు పాల్గొనున్నారు. కేవలం దౌత్య ప్రతినిధులను మాత్రమే అమెరికా బీజింగ్‌కు పంపదు. అమెరికా అథ్లెట్లకు పూర్తి మద్దతు ఉంటుందని, తామంతా వారితోనే ఉన్నామని వైట్‌హౌస్‌ సెక్రెటరీ పేర్కొన్నారు. దౌత్యపరంగా క్రీడలను బహిష్కరించడంపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జావో లిజియాన్‌ అమెరికా తీరుపై విమర్శలు గుప్పించారు. ఇంతకు ముందు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అధికారంలో ఉన్న ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో 1980లో చివరిసారిగా అమెరికా మాస్కో ఒలింపిక్స్‌ను పూర్తిగా బహిష్కరించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/