వెయ్యికి పైగా చైనీయుల వీసాలు రద్దు చేసిన అమెరికా

చైనా విద్యార్థుల‌ వీసాలను దుర్వినియోగం చేస్తోందన్న అమెరికా

US Cancels 1K Visas of Chinese Nationals, Citing Security Risks

వాషింగ్టన్‌: చైనాపై ఆగ్రహంగా ఉన్న అమెరికా ఆ దేశంపై మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా చైనీయుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. డ్రాగన్ దేశం నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థులు, పరిశోధకులకు ఆ దేశ ఆర్మీతో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇటువంటి వ్య‌క్తులు త‌మ దేశానికి చెందిన సమాచారాన్ని చోరీ చేయ‌కుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని అమెరికా పేర్కొంది.

చట్టవ్యతిరేక వ్యాపార పద్ధతులతో అమెరికా మేధో సంపత్తితోపాటు కరోనా వైరస్‌ పరిశోధనా సమాచారాన్ని చోరీ చేసేందుకు చైనా విద్యార్థుల‌ వీసాలను డ్రాగ‌న్ ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. హాం‌కాంగ్‌లో డ్రాగ‌న్ దేశ చ‌ర్య‌ల‌ను నిరోధించే చర్యల్లో భాగంగా మే 29న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చేసిన ప్రకటన కింద ఈ వీసాల‌ను రద్దు చేస్తున్న‌ట్లు అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. అయితే, త‌మ దేశ‌ చట్టాలకు లోబడి వచ్చే విద్యార్థులకు మాత్రం అమెరికా ఎల్ల‌ప్పుడూ స్వాగ‌తం పలుకుతుందని చెప్పారు. చైనా క‌రోనా వైర‌స్ కు సంబంధించిన‌ స‌మాచారాన్ని వెల్ల‌డించక పోవ‌డం, హాంకాంగ్ లో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న నేప‌థ్యంలో ఆ దేశంపై ట్రంప్ ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇటీవ‌ల ఇరు దేశాల మ‌ధ్య ప్ర‌తీకార చ‌ర్య‌లు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు పోటీలు ప‌డి ఆంక్ష‌లు విధించుకుంటున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/