ఆ హోట‌ళ్ల‌లో ఉండ‌కూడ‌దు: తమ పౌరుల‌కు అమెరికా, బ్రిటన్ సూచ‌న

ఆఫ్ఘ‌నిస్థాన్ లోని హోట‌ళ్ల‌లో ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం.. అమెరికా, బ్రిట‌న్ హెచ్చ‌రిక‌

కాబుల్ : ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి అమెరికా ద‌ళాలు వెన‌క్కి వెళ్లిన త‌ర్వాత తాలిబ‌న్లు తాత్కాలిక‌ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఉగ్ర‌దాడులు ఆగ‌డం లేదు. ఇటీవ‌ల ఐఎస్ తీవ్ర వాదులు మ‌సీదులో భారీ దాడి జ‌రిపి ప్ర‌పంచాన్ని ఉలిక్కిప‌డేలా చేశారు. దీంతో కాబుల్‌ హోటళ్లలో ఉన్న తమ పౌరుల‌కు అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు ప‌లు సూచ‌న‌లు చేశాయి. ప్రత్యేకంగా సెరెనా హోటల్‌ దరిదాపుల్లో కూడా ఉండకూడదని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. ఆ ప్రాంతంలో రక్షణ పరమైన సమస్యలు ఉన్నాయని తెలిపింది.

అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్‌ వెళ్లకూడదని బ్రిటన్‌ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ హోటళ్లలో ఉండటం అంత సురక్షితం కాదని, ప్రత్యేకంగా కాబుల్‌లోని హోటళ్లకు దూరంగా ఉండాలని సూచించింది. కాబూల్‌లో ఉన్న అత్యున్నత లగ్జరీ హోటళ్లలో సెరెనా ఒకటి. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్న తర్వాత అక్కడ రెండు సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/