టెలికాం రంగంలో అవాంఛితపోటీ!

Unwanted competition in telecom sector!

దేశంలోని టెలికాం కంపెనీల పరిస్థితి రానురాను అధ్వాన్నంగా మారుతోంది. ఓవైపు వెంటాడుతున్న స్పెక్ట్రమ్‌ బకాయిలు, లైసెన్సుఫీజు బకాయిలతోపాటు గడచిన మూడేళ్లుగా నెలకొన్న అవాంఛిత పోటీ భారీస్థాయి కంపెనీలను సైతం కుదిపేస్తోంది. ప్రత్యేకించి ఈ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు చూస్తే దేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలు లక్షకోట్ల రూపాయలకుపైబడి నష్టపోయాయని తెలుస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు చేపట్టి సెక్రటరీలతో కూడిన కమిటీని ఏర్పాటుచేసి ఏవిధంగా సాయపడగలమోనన్న అధ్యయన నివేదికలకు ఆదేశించిన టెల్కోల్లో ఈ నష్టాల భారం ఇప్పట్లో తీరేవిధంగాలేదు. వీటికితోడు రుణభారం కూడా టెల్కోలను వెంటాడుతోంది.

రిజర్వుబ్యాంకు వాణిజ్య బ్యాంకులపై విధించిన పరిమితులు, ఆంక్షల కారణంగానే బ్యాంకర్లు కూడా టెల్కోలకు రుణం ఇవ్వా లంటే జంకుతున్నారు. ఒక్కక్కరివద్ద ప్రస్తుతం వేలకోట్ల లోనే రుణబకాయిలు పేరుకుని ఉన్నాయి. వీటితోపాటుగా స్థూలరాబడి సర్దుబాటుకింద(ఎజిఆర్‌) సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులతో కంపెనీలు మరింతగా కుదేలయ్యా యి. ఇప్పటికే అనిల్‌ అంబానికి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌సంస్థ దివాలా ప్రక్రియకు చేరుకోవడంతో బ్యాంకర్లు టెల్కోలు అంటేనే రుణాలకు జంకుతున్నారు. ఈ త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా,ఎయిర్‌టెల్‌ కంపెనీల నికరనష్టం రూ.74వేల కోట్లుగా ఉంది. రిల యన్స్‌ కమ్యూనికేషన్స్‌ 30,142 కోట్లుగా ఉందని అంచనా. ఇక టాటా టెలీ సర్వీసెస్‌ నష్టాలు 2335 కోట్లుగా ఉంది.

వీటికితోడు అదనంగా సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులతో సుమారు 1.3 లక్షలకోట్ల బకాయిల ను రికవరీచేసే దిశగా డాట్‌ ఉంది. మొత్తం 15 కంపెనీలకు డిమాండ్‌ నోటీసులు ఇప్పటికే జారీచేసాయి. ఈ మొత్తంలో 92 వేలకోట్లు లైసెన్సుఫీజు బకాయిలుంటే స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జిలకింద 41 వేల బకాయిలున్నాయి. వీటిలో మూడు పెద్ద కంపెనీలదే అత్యధిక వాటాతో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌జియోలు మాత్రమే కార్యకలాపాలు సాగిస్తుంటే మిగిలిన కంపెనీలు ఇప్పటికే మూతపడ్డాయి.

వీటిలో ఎయిర్‌సెల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌పై దివాలా ట్రిబ్యునల్‌కు కేసులు పడ్డాయి. ఇప్పుడు బకాయిలపరంగా 39వేల కోట్లు వొడాఫోన్‌ ఐడియా సంస్థ డాట్‌కు చెల్లించాలని ఆదేశించింది. ఇప్పుడు కొత్తగా వీటిపై రివ్యూపిటిషన్లు దాఖలు చేసుకున్నా ప్రభుత్వపరంగా బెయిల్‌ఔట్‌ ప్యాకేజి లేనిపక్షంలో టెలికం కంపెనీలు కోలుకునే స్థితిలో లేవు. వాస్తవానికి గడచిన మూడేళ్లుగా టెలికాం రంగంలో అవాంఛిత పోటీతో అప్పటివరకూ నిలదొక్కుకున్న కంపెనీలన్నీ మూతపడ్డాయి. కొన్ని విలీనం అయ్యాయి. మరికొన్ని అందినమేరకు సొమ్ముచేసుకుని చెక్కేసాయి. వీటిలో టెలినార్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు.

నార్వేకు చెందిన ఈ కంపెనీ ఎంత దూకుడుగా వచ్చిందో అంతే దూకుడుతో మూతపడింది. అలాగే మరో రష్యన్‌కంపెనీ కూడా భారత్‌నుంచి వెళ్లిపోయింది. ఇక ఉన్న మూడు నాలుగు కంపెనీలు అవాంఛిత పోటీతో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం ఏలిన సంస్థలు ఇప్పుడు కస్టమర్లు తగ్గిపోయి రాబడిలేక సతమతం అవుతున్నాయి. సగటు వినియోగరాబడి సైతం కోల్పోతున్నాయి. వీటిలో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలయితే ఎక్కువభారం మోస్తున్నాయి.

మరోపక్క భారత్‌ టెలికాం వ్యాపారం నుంచి వైదొలగడమే మంచిదని బ్రిటన్‌ వొడాఫోన్‌ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలోను, ఆర్థిక మాంద్యంలో భారత్‌లో వ్యాపారం గిట్టుబాటుకాదన్న ధోరణిని వ్యక్తం చేసింది. త్వరలోనే వ్యాపారాన్ని ముగించుకుని పెట్టేబేడా సద్దుకునే పనిలో ఉంది. ఇదే జరిగితే భారత్‌లోని టెలికాం రంగంలో షట్‌డౌన్‌ ప్రారంభం అయినట్లే. ఇక స్టాక్‌ఎక్ఛేంజిల్లో అయితే వీటిషేర్లు ప్రత్యేకంగా చెప్పాల్సినవి కాదు. 52 వారాల కనిష్టానికి పడిపోతున్నాయి.

కొంతలో కొంత కోలుకుని మళ్లీ నష్టాలబాటలోనే కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ముందు అధిగమించాలంటే అవాంఛిత పోటీని కట్టడి చేయాలి. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. అలాగే స్పెక్ట్రమ్‌, లైసెన్సుఫీజు బకాయిలపై బెయిల్‌ఔట్‌ ప్యాకేజిని ప్రకటించాల్సి ఉంటుంది. వడ్డీలేని రుణపరపతిని అందించాలి. అవసరమైతే ప్రభుత్వ గ్యారంటీతో అయినా టెల్కోలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

తమ హయాంలో ఏ ఒక్క టెలికాం కంపెనీని మూతపడే స్థితికి రానీయబోమని, తాము ఏర్పాటు చేసిన ప్యానెల్‌ ఇచ్చే అధ్యయన నివేదిక ఆధారంగా కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ హామీలను తక్షణమే ఆచరణలోనికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే పన్నులపరంగా కూడా టెల్కోలకు కొంతమేర సడలింపులు ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి. లేదా వారి బకాయిల వసూళ్లును వాయిదా వేయాలి.

వడ్డీరాయితీలు ఇతరత్రా పన్నుల మినహాయింపులు వంటివి కల్పించని పక్షంలో మరింత అధ్వాన్న పరిస్థితి అలుముకుంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం టెలికాం రంగంలో నెలకొన్న ఈ అవాంఛిత పోటీ వాతావరణంలో ప్రభుత్వ జోక్యం అనివార్యం అవుతోంది.

అదే లేనిపక్షంలో దేశంలోని టెలికాం కంపెనీల పరంగా గుత్తాధిపత్య పోటీ వాతావరణం అలుముకుని మరే ఇతర కంపెనీ మనుగడ సాగించలేని పరిస్థితులు అలుముకుంటాయనడంలో ఎలాంటి సందేహంలేదు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com