అంతర్జాతీయంగా మరోమారు భంగపడిన పాక్

  • చైనా వాదనను తోసిపుచ్చిన ఇతర దేశాలు
UNSC
UNSC

న్యూయార్క్‌ :కశ్మీర్‌కు ఇప్పటి వరకు ఉన్న స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం ఎత్తివేసిన తర్వాత పాక్ ఉడికిపోతోంది. ఈ విషయంలో అంతర్జాతీయంగా భారత్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించి విఫలమైన దాయాదికి ఈసారి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ కోలుకోలేని షాక్ తగిలింది. చైనా మద్దతుతో విర్రవీగుతున్న పాక్‌కు ఈసారి గట్టి దెబ్బే తగిలింది.

కశ్మీర్ అంశంపై చర్చించేందుకు గత రాత్రి ఐరాస భద్రతామండలి రహస్యంగా సమావేశమైంది. 73 నిమిషాలపాటు సమావేశం జరగ్గా భారత్‌కు రష్యా అండగా నిలిచింది. పాకిస్థాన్ వాదనను చైనా బలపరిచినప్పటికీ రష్యా దానిని తోసివేసింది. జమ్ముకశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయంటూ చైనా చేసిన వాదనను అన్ని దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. కశ్మీర్ అంశం ఆ రెండు దేశాలకు చెందిన ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పడంతో చైనా వెనక్కి తగ్గక తప్పలేదు. భద్రతా మండలిలోని మిగతా దేశాలు కూడా పాక్ వాదనను ఖండించడంతో పాక్, చైనాలకు దిక్కుతోచలేదు. కశ్మీర్ విషయంలో అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యాలు భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించడంతో పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా మరోమారు ఆశాభంగమైంది.

సమావేశం అనంతరం ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. ఇందులో ఇతరులు జోక్యం చేసుకోలేరని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఇప్పటికైనా ఉగ్రవాదానికి ఊతమివ్వడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/