ఉన్నావ్‌ బాధితురాలి హత్యపై అఖిలేష్‌ ధర్నా

Akhilesh-sits-on-dharna
Akhilesh-sits-on-dharna

లఖ్‌నవూ: ఉత్తర ప్రదేశ్‌ మాజీ సిఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఉన్నావ్‌ అత్యాచార బాధిరాలు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి మరణానికి ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండు చేస్తూ లక్నోలోని రాష్ట్ర అసెంబ్లీ బయట ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం కార్యదర్శి, డిజిపి రాజీనామా చేసేంతవరకు ఉన్నావ్ బాధితురాలికి న్యాయం జరగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని ఐదుగురు నిందితులు కాల్చి తగలబెట్టడంపై ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు మృగ్యమయ్యాయని, ముఖ్యమంత్రి ఇందుకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో శోక సభలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇలా ఉండగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉన్నావ్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడకు బయల్దేరి వెళ్లారు. బాధితురాలికి న్యాయం చేయలేకపోయిన వ్యవస్థపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి రక్షణ కల్పించలేకపోయిన యుపి ప్రభుత్వాన్ని ఆమె తప్పుపట్టారు. యుపిలో శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఈ సంఘటనే దర్పణం పడుతుందని ఆమె విమర్శించారు. కాగా, బిఎస్‌పి అధినేత్రి మాయావతి కూడా ఉన్నావ్ బాధితురాలి మృతికి విచారం ప్రకటించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని ఆమె కోరారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/